Telugu Gateway
Telangana

కెసీఆర్ కేబినెట్ లో ఏడుగురు కొత్త వారికి ఛాన్స్?!

కెసీఆర్ కేబినెట్ లో ఏడుగురు కొత్త వారికి ఛాన్స్?!
X

తెలంగాణలో కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వంలో మంత్రి అయ్యే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది. ఎంత మంది కొత్త వారికి ఛాన్స్ ఉంటుంది?. ఎంత మంది పాత వారు తమ పదవులు నిలబెట్టుకుంటారు?. ఇదే ఇప్పుడు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చర్చ. పలు జిల్లాలకు చెందిన నేతలు ఎలాగైనా మంత్రివర్గంలో బెర్తు దక్కించుకోవాలనే ఆశతో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో..ముఖ్యమంత్రి కెసీఆర్ ఎవరి వైపు మొగ్గుచూపుతారో అన్నది వేచిచూడాల్సిందే. అయితే నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏడుగురు కొత్త వారికి ఛాన్స్ దక్కటం ఖాయంగా కన్పిస్తోంది. మంత్రులుగా ఉండి తాజా ఎన్నికల్లో ఓటమి పాలైన పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, తుమ్మల నాగేశ్వర్ రావుల స్థానంలో ఆయా జిల్లాల్లో కొత్త వారికి ఛాన్స్ కల్పిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు ఇటీవల వరకూ ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రి పదవులు అనుభవించిన నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరిలకు ఈ సారి ఛాన్స్ దక్కకపోవచ్చమో అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీంతోపాటు గత కేబినెట్ లో కొనసాగిన మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కో..లేక మరో మంత్రికో స్పీకర్ ఇస్తారని చెబుతున్నారు.

ఈ లెక్కన ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆరేడు కొత్త ముఖాలకు చోటు దక్కటం ఖాయం అని ఎమ్మెల్యేల్లో చర్చ నడుస్తోంది. దీనికి తోడు అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనుండటం, ఆ తర్వాతే మళ్ళీ లోక్ సభ ఎన్నికలు ఉండటంతో మిగిలిన జిల్లాల్లోనూ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి రిస్క్ తీసుకోవటం ఎందుకు? అనే భావనలో కెసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. ఈ లెక్కన ఓటమి పాలైన మంత్రుల జిల్లాల్లో తప్ప..మిగిలిన చోట్ల ఒకటి అరా తప్ప..పెద్దగా మార్పులు ఉండవని ఎమ్మెల్యేలు అంచనా వేసుకుంటున్నారు. తెలంగాణలో సీఎంతో కలుపుకుని మొత్తం 18 మంత్రి పదవులకే ఛాన్స్ ఉంటుంది. ఆరేడు కొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తున్నందున మిగిలిన వాటిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లెక్కలు ఏ మేరకు నిజం అవుతాయో కెసీఆర్ అసలు జాబితా సిద్ధం చేసిన తర్వాత కానీ తేలే అవకాశం లేదు. కొత్త వారిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి నుంచి గెలుపొందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావులకు కేబినెట్ బెర్త్ ఖాయం అని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it