Telugu Gateway
Movie reviews

‘కవచం’ మూవీ రివ్యూ

‘కవచం’ మూవీ రివ్యూ
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘సాక్ష్యం’ సినిమాతో ఓ హిట్ కొట్టాడు. ఈ హీరో గత సినిమాలతో పోలిస్తే ‘సాక్ష్యం’ మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ హిట్ తర్వాత విడుదలైన సినిమానే ‘కవచం’. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో బెల్లంకొండకు జోడీగా కాజల్, మెహరీన్ లు నటించారు. చాలా మంది హీరోలు పోలీసు కథను ఎంచుకుంటే చాలా సేఫ్ జోన్ అనుకుంటారు. ఆ రకంగా హిట్స్ కొట్టిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన వంతుగా పోలీస్ పాత్రతో రంగంలోకి దిగాడు. ట్రైలర్ లోనే సినిమా కథను చెప్పేశాడు. భ‌య‌పెట్టే వాడికీ, భ‌య‌ప‌డేవాడికీ మ‌ధ్య క‌వ‌చంలా ఒక‌డుంటాడురా. వాడే పోలీస్‌ అంటూ ఈ యువ హీరో రంగంలోకి దూకాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గుర్తింపు పొందాలనేది హీరో ఆశ. హీరో తండ్రి కూడా పోలీసు అధికారిగా పని చేసి చనిపోతాడు. ఆప‌ద‌లో ఉన్న అమ్మాయిని అమ్మ‌లా చూసుకోమ‌ని హీరోకు వాళ్ల‌మ్మ చెప్పిన మాట వేద‌మంత్రం.

అందుకే అమ్మాయిలంటే చాలా గౌర‌వంగా చూస్తాడు. ఎలాంటి కేసుల‌నైనా డీల్ చేయాల‌నే సాహ‌సాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటాడు. అత‌ను ఓ సారి ప‌ర్సు పోగొట్టుకుంటాడు. అత‌ని ప‌ర్సును ఓ అమ్మాయి (కాజ‌ల్‌) తీసుకొచ్చి ఇస్తుంది. అప్ప‌టినుంచి ఆమెను ప్రేమిస్తాడు. అయితే ఆమెకు పెళ్లి కుదిరింద‌ని తెలుస్తుంది. అదే స‌మ‌యంలో సంయుక్త (మెహ‌రీన్‌) అనే అమ్మాయిని కాపాడుతాడు విజ‌య్‌. ఓ సంద‌ర్భంలో విజ‌య్ త‌ల్లి త‌ల‌కు ఆప‌రేష‌న్ జ‌రుగుతుంది. ఆమెను కాపాడుకోవ‌డానికి సంయుక్త చెప్పిన‌ట్టు చేస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది.

సంయుక్త‌లాగా అప్ప‌టిదాకా ప‌రిచ‌య‌మైన అమ్మాయి నిజ‌మైన సంయుక్త కాదా? కాక‌పోతే మ‌రో సంయుక్త ఎవ‌రు? అలాంట‌ప్పుడు ఈమె ఎందుకు సంయుక్త‌గా న‌టించాల్సి వ‌చ్చింది? అనే సస్పెన్స్ వీడాలంటే సినిమా చూడాల్సిందే. పోలీసు అధికారిగా బెల్లంకొండ శ్రీనివాస్ తన పాత్రకు న్యాయం చేశాడు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు..కెమెరా రిచ్ నెస్ బాగున్నాయి. కథ విషయానికి వస్తే ఎన్నో సినిమాల్లో చూసిన పోలీస్ స్టోరీలనే తలపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్లు కాజల్, మెహరీన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. యాక్షన్ థ్రిల్లర్ అన్న జానర్‌కు తగ్గట్టుగా మంచి ట్విస్ట్‌ లతో కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. అయితే కొన్ని సీన్స్‌ లో ప్రేక్షకులను థ్రిల్‌ చేసినా చాలా చోట్ల స్లోగా సాగుతుంది సినిమా. ఓవరాల్ గా చూస్తే మరో పోలీస్ స్టోరీ ఇది.

రేటింగ్. 2.25/5

Next Story
Share it