Telugu Gateway
Cinema

సినీ హీరో విశాల్ అరెస్టు

సినీ హీరో విశాల్ అరెస్టు
X

తమిళనాట సినిమా రాజకీయం వేడెక్కింది. అది ఎంతలా అంటే..ఏకంగా హీరో విశాల్ అరెస్టు వరకూ వెళ్లింది. గత కొన్ని రోజులుగా విశాల్ పై సినీ పరిశ్రమలోని వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో తమిళ నిర్మాతల మండలిలో నెలకొన్న విబేధాలు తారాస్థాయికి చేరాయి. విశాల్ అరెస్ట్‌ తో గురువారం నిర్మాతల మండలి ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్‌ను తొలుత అభినందించిన వాళ్లే ఇప్పుడు విమర్శిస్తున్నారు. సమస్యలను పట్టించుకోవడం లేదని.. పైరసీని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ సినిమాల వెబ్‌సైట్‌ తమిళ్‌రాకర్స్‌ లో విశాల్‌కు షేర్‌ ఉందంటూ ప్రముఖ నిర్మాత అజగప్పన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక మీదట విశాల్ ను నిర్మాతల మండలిలోకి రానిచ్చేది లేదంటూ ఆయన ప్రత్యర్థులు కొందరు కార్యాలయానికి తాళం వేశారు. దీంతో విశాల్‌ తాళం పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకూ చెన్నై పోలీసలు విశాల్‌ను అరెస్ట్‌ చేశారు. ఓ వర్గం గత కొంత కాలంగా విశాల్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది. అంతేకాక ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్‌ చేసేలా పర్మిషన్‌ ఎలా ఇచ్చారంటూ చిన్న సినిమాల నిర్మాతలు విశాల్‌ను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it