Telugu Gateway
Movie reviews

‘అంతరిక్షం’ మూవీ రివ్యూ

‘అంతరిక్షం’ మూవీ రివ్యూ
X

ప్రయోగాలు చేయటానికి సాహసం కావాలి. ఆ సాహసం దర్శకుడు సంకల్ప్ రెడ్డికి ఉంది. అందుకే ఆయన ధైర్యంగా...ఎన్నో కష్టనష్టాలనోర్చి ‘ఘాజీ’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాను తెరకెక్కించారు. అంతే కాదు..ఒక్క సినిమాతో..అదీ తొలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ కథలను నమ్ముకోకుండా విభిన్నమైన కధాంశాలతోనే సినిమాలు తీస్తాను అన్న చందంగా సంకల్ప్ రెడ్డి మరోసారి ‘అంతరిక్ష’ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ‘అంతరిక్షం’ సినిమాతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి రేంజ్ మరింత పెరగటం ఖాయం. ఏ మాత్రం కామెడీ సీన్లు..సినిమాటిక్ అంశాలు పెద్దగా లేకుండా కేవలంనే కథనే నమ్ముకుని సినిమా తీయటం అంటే..సాహసమే అని చెప్పాలి. దీనికి సహకరించే నిర్మాతలనూ అభినందించాల్సిందే. అంతరిక్షం సినిమా అదే నిజం చేసి చూపించింది.

ఓ శాటిలైల్ అంతరిక్షంలో గతి తప్పటం ఒకెత్తు అయితే..అలా గతి తప్పిన శాటిలైట్ కారణంగా మిగిలిన వాటికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి. అలా గతితప్పిన శాటిలైట్ ను దారిలోకి తెచ్చి..దాని వల్ల మిగిలిన వాటికి నష్టం లేకుండా చేయటం అనే పనిలో దేవ్ (వరుణ్ తేజ్) ఉంటాడు. రష్యాలో శిక్షణ పొందిన అంతరిక్ష పరిశోధకుడిగా దేవ్ కొన్ని రోజులు పనిచేసి..తన మిషన్ విఫలం అవటంతో విధులకు దూరంగా వెళ్లిపోతాడు. కానీ అత్యవసర పనులు..దేశ ప్రతిష్టకు సంబంధించిన సమస్యలు రావటంతో దేవ్ సాయం కోరతారు. ఆ మిషన్ ను దేవ్ ఎలా పూర్తి చేశాడు అన్నదే అంతరిక్షం సినిమా. అంతరిక్ష పరిశోధకుడిగా ఉన్న దేవ్ కు రియా(అదితిరావ్‌ హైదరి), కరణ్‌ (సత్యదేవ్‌), సంజయ్‌ (రాజా)లతో కలిసి స్పేస్‌లోకి వెళ్లి ఆపరేషన్ పూర్తి చేస్తారు.

కోపాన్ని నియంత్రించుకోలేని సైంటిస్ట్ గా దేవ్ పాత్ర కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది. రియా పాత్రలో అదితిరావ్‌ హైదరి ఆకట్టుకుంది. లుక్స్‌ లావణ్య త్రిపాఠిది దాదాపు అతిథి పాత్రే. ఉన్నంతలో అందంతో.. అభినయంతోనూ ఆకట్టుకుంది. అంతరిక్షం కోసం సంకల్ప్‌ తయారు చేసుకున్న కథనం దాదాపు ఘాజీలాగే సాగుతుంది. ఎక్కువ భాగం పాత్రల పరిచయంతో పాటు స్పేస్‌ మిషన్‌ అవసరం ఏంటి అన్న విషయాలను వివరించేందుకు కేటాయించాడు. వ్యోమగామలు ఎలాంటి కోడ్స్‌ వాడతారు. ఎలా కమ్యూనికేట్ చేస్తారు లాంటి అంశాల్లో సంకల్ప్ చేసిన రిసెర్చ్‌ తెర మీద కనిపిస్తుంది. స్పేస్‌లో ఉండే పరిస్థితులను తెర మీద కళ్లకు కట్టినట్టుగా చూపించాడు సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌. ఓవరాల్ గా చూస్తే సంకల్ప్ రెడ్డి ‘అంతరిక్ష’ ప్రయోగం సక్సెస్ అయినట్లే.

రేటింగ్. 3.25/5

Next Story
Share it