Telugu Gateway
Telangana

కెసీఆర్ లో ఎందుకు ఆ కలవరం?

కెసీఆర్ లో ఎందుకు ఆ కలవరం?
X

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కెసీఆర్ లో ఎందుకంత కలవరం?. తెలంగాణ రాష్ట్రంలో కౌలుదారులకు ఎవరూ చేయని అన్యాయం చేసింది కెసీఆర్. ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే నిన్న మొన్నటివరకూ కౌలుదారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. తెలంగాణలోని పట్టాదారు పాస్ పుస్తకాల్లో హక్కుదారుతోపాటు కౌలుదారుల కోసం ప్రత్యేక కాలమ్ ఉండేది. ఇది ఎందుకు అంటే పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే రైతులు ఎప్పుడైనా తుఫాన్లు..కరవు వచ్చినప్పుడు సర్కారు ఇచ్చే నష్టపరిహారం కౌలుదారులకు అందజేయటానికి వీలుగా. కానీ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా కౌలుదారుల కాలాన్ని పాస్ బుక్ నుంచి పూర్తిగా తొలగించేశారు. అంటే ఈ లెక్కన వ్యవసాయం చేసేది కౌలుదారులైన రైతు బంధు కింద చేసే సాయం భూమి సొంత దారునికే వెళుతుంది. ప్రకృతి విపత్తుల సమయంలో అందించే సాయం కూడా అంతే. అయితే అది భూ యాజమాని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది కౌలుదారుకు ఆ మొత్తం ఇవ్వాలా?.వద్దా? అనేది. ఇలా కౌలుదారులకు కెసీఆర్ తీరని అన్యాయం చేశారు.

రైతు బంధు సాయం విషయంలో కౌలుదారుల అంశాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తే వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కెసీఆర్..ఇప్పుడు సడన్ గా ఎన్నికల వేళ కౌలుదారులకు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు..ఏకంగా మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు. అసలు కౌలుదారులు సాయానికి అర్హులే కాదన్నట్లు మాట్లాడిన కెసీఆర్ ఎందుకు సడన్ గా రూటు మార్చారు?. రైతు బంధు లబ్ధిదారుల కంటే కౌలుదారులే ఎక్కువ ఉండటం వల్ల..రాజకీయంగా అది ఇబ్బంది చేస్తుందనే భయంతోనే కెసీఆర్ రూటు మార్చినట్లు చెబుతున్నారు. అసలు నిరుద్యోగ భృతి ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించిన కెసీఆర్..మళ్ళీ మేనిఫెస్టోలో ఆ అంశాన్ని కూడా చేర్పించారు. తొలుత రైతు బంధు కింద ఏడాదికి ఒక పంటకు ఎకరాకు 4 వేల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు. మళ్ళీ వెంటనే ఈ సాయాన్ని రెండు పంటలకు పెంచి..ఏటా ఎకరాకు 8 వేలు చేశారు. ఇప్పుడు మేనిఫెస్టోలో తమను గెలిస్తే రెండు పంటలకు కలిపి ఎకరాకు పది వేలు ఇస్తామని ప్రకటించారు. తన నిర్ణయాలను తానే అలా ఎందుకు మార్చుకుంటూ పోతున్నారు?. ఎందుకు కెసీఆర్ కలవరానికి గురవుతున్నారు అన్న చర్చ జోరుగా సాగుతోంది.

Next Story
Share it