Telugu Gateway
Telangana

ఆ 14..8...3 సీట్లపై టీఆర్ఎస్ మరింత ఫోకస్!

ఆ 14..8...3 సీట్లపై టీఆర్ఎస్ మరింత ఫోకస్!
X

ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతుంది. తాజాగా జరిగిన సమావేశంలో మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ, టీజెఎస్, సీపీఐలు దక్కించుకునే సీట్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాటిని దక్కించుకోవటం ద్వారా గెలుపును సునాయాసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీపీఐకి సీట్ల కేటాయింపు వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. టీడీపీకి 14 సీట్లు, టీజెఎస్ కు 8 సీట్లు ఇచ్చేందుకు కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఓట్ల బదిలీ జరగకుండా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కీలక నేతలను తమ వైపు తిప్పుకోవటంతోపాటు..రకరకాల అస్త్రాలతో ఈ సీట్లను టార్గెట్ చేస్తే తమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని టీఆర్ఎస్ అగ్రనేతల అంచనా. టీడీపీకి కేటాయించే 14 సీట్లలో ఇప్పటికే 9 చోట్ల అభ్యర్ధులను ప్రకటించింది ఆ పార్టీ. టీడీపీతో పోలిస్తే టీజెఎస్ సీట్లను మరింత తేలిగ్గా దక్కించుకునే అవకాశం ఉందని..ఇలా చేయటం ద్వారా ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణలో సీపీఐ సొంత బలంతో గెలిచే సీటు ఒక్కటీ లేని పరిస్థితి.

పొత్తుల్లో భాగంగానే ఏమైనా బయటపడితే పడాలి. అలాంటి సీట్లను ఎంపిక చేసుకుని..ఆర్థికంగా..రకరకాల అస్త్రాలను వాడే పనిలో అధికార పార్టీ ఉంది. టీడీపీ బరిలో నిలిచే చోట్ల కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తాను పోటీ చేసే సీట్లతో పాటు పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లలో గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేయకపోతే అంతిమంగా ఆ పార్టీకే నష్టమని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని టార్గెట్ చేశారు. మరి చంద్రబాబు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీకి కేటాయించిన 14 సీట్లలో గెలుపునకు కృషి చేస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it