Telugu Gateway
Politics

సుజనా ఎపిసోడ్...‘అత్మరక్షణ’లో తెలుగుదేశం పార్టీ

సుజనా ఎపిసోడ్...‘అత్మరక్షణ’లో తెలుగుదేశం పార్టీ
X

ఎన్నికలకు కొద్ది నెలల ముందు వెలుగులోకి వచ్చిన ‘సుజన’ ఎపిసోడ్ ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఓ వైపు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వందల కోట్ల రూపాయలు పన్ను కట్టని ఆదాయం గుర్తించినట్లు ఐటి దాడుల్లో వెల్లడైంది. ఇప్పుడు మరో రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఏకంగా 5700 కోట్ల రూపాయల వరకూ బ్యాంకులను ముంచినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారికంగా ప్రకటించటంతో టీడీపీ చిక్కుల్లో పడినట్లు అయింది. అంతే కాదు..ఈ నెల 27న ఈడీ ముందు హాజరుకావాల్సిందిగా సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సుజనా చౌదరి ఏకంగా 120 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి బ్యాంకులను భారీ మొత్తంలో ముంచినట్లు ఈడీ ఆరోపిస్తోంది. డొల్ల కంపెనీల పేరుతో కొనుగోలు చేసిన ఆరు ఖరీదైన కార్లను ఈడీ స్వాదీనం చేసుకుంది. దేశంలో సంచలనం సృష్టించిన విజయ్ మాల్యా కేసు తరహాలోనే సుజనా చౌదరి ఏకంగా బ్యాంకులకు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల శఠగోపం పెట్టడంతో టీడీపీ ఇప్పుడు ఇరకాటంలో పడినట్లు అయింది.

ఓ వైపు తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీలోకి సీబీఐ ప్రవేశానికి అనుమతి లేదు..ఈడీ, ఐటి దాడులు జరగకుండా ఆరు నెలల నిషేధం సుప్రీంకోర్టులో పిటీషన్ వేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్న తరుణంలో టీడీపీకీ ఈ ఎదురుదెబ్బ తగిలింది. ఇది రాజకీయంగా కూడా టీడీపీకి నష్టం చేయటం ఖాయం అనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. సుజనా చౌదరి తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులనే కంపెనీల డైరెక్టర్లుగా నియమించి బ్యాంకులను బురిడీ కొట్టించిన వైనం బహిర్గతం అయింది. బ్యాంకులకు రూ. వందల కోట్లు ఎగ్గొట్టిన సుజనా గ్రూపులోని ఓ కంపెనీ లావాదేవీల్లో ఫెమా చట్ట ఉల్లంఘనలు జరిగాయన్న సీబీఐ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈడీ... శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వరకు హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో చేసిన సోదాల్లో సుజనా అక్రమాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌ పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయం అడ్రస్‌తో ఉన్న బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌)లో ఈడీ సోదాలు ప్రారంభించింది.

బీసీఈపీఎల్‌ మూడు బ్యాంకుల నుంచి రూ. 364 కోట్లు రుణాలుగా పొంది ఎగవేసింది. దీంతో రుణాలు జారీ చేసిన బ్యాంకులు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఇందుకు సంబంధించి మూడు కేసులు నమోదు చేసింది. ఈ కంపెనీల్లో జరిగిన లావాదేవీల్లో ఫెమా చట్ట ఉల్లంఘన జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌కు సీబీఐ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ చెన్నై బృందం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించింది. బీసీఈపీఎల్‌ కంపెనీ చేసిన నేరంపై దర్యాప్తు చేస్తుండగా సుజనా చౌదరి సాగించిన భారీ ఆర్థిక నేరాల కుట్ర వెల్లడైంది. సుజనా చౌదరి చైర్మన్‌గా ఉన్న సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల గొడుగు కింద ఏర్పాటు చేసిన 120 షెల్‌ కంపెనీల జాబితా ఈడీ అధికారుల చేతికి చిక్కింది.

ఈ కంపెనీలన్నీ పంజాగుట్టలోని ఒకే చిరునామాపై ఏర్పాటు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారికి ఈ కంపెనీలు సాగించిన లావాదేవీల విషయాలు ఏవీ తెలియకపోవడంతో ఈడీ మరింత లోతుగా సోదాలు చేపట్టింది. సుజనా చౌదరి 120 షెల్‌ కంపెనీల పేరుతో రూ. 6 వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టినట్లు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించింది. ఈ కంపెనీల్లో సాగించిన ఆర్థిక నేరాలకు, కుట్రకు దారి తీసిన అంశాలన్నీ ఆయా కంపెనీల ఈ–మెయిల్స్‌లో లభించాయి. డైరెక్టర్లకు, సుజనా చౌదరికి మధ్య జరిగిన కీలక వివరాలు ఈ–మెయిల్స్‌ లో లభ్యమయ్యాయి. వాటికి సంబంధించిన హార్డ్‌ డిస్క్‌ లను ఈడీ స్వాధీనం చేసుకుంది.

ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారిని ఈడీ శనివారం విచారించగా సుజనా చౌదరి చెప్పినట్లే తాము వ్యవహరించామని, కంపెనీల్లో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియదని, ఈ మొత్తం వ్యవహారం సుజనా కనుసన్నల్లోనే జరిగినట్లు వాంగ్మూలాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ఏడు చోట్ల, ఢిల్లీలో ఒక చోట ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 126 రబ్బర్‌ స్టాంపులు, షెల్‌ కంపెనీల పేర్ల మీద కొనుగోలు చేసిన ఆరు లగ్జరీ కార్ల (ఆడీ, ఫెరారీ, బెంజ్‌ రేంజ్‌ రోవర్‌)ను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. స్పష్టంచేశారు. ఈ వ్యవహారంపై సుజనా చౌదరి కంపెనీ తరపున ఓ ప్రకటన వెలువడింది. ఈడీ అధికారులకు తాము పూర్తి సమాచారం ఇచ్చామని..సుజనా చౌదరి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

Next Story
Share it