Telugu Gateway
Telangana

ఎన్నికల వేళ టీఆర్ఎస్ సర్కారుకు షాక్

ఎన్నికల వేళ టీఆర్ఎస్ సర్కారుకు షాక్
X

తెలంగాణ సర్కారుకు షాక్. నిరసనలను అణచివేస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలుపుదల చేసింది. అక్కడ ధర్నాలు చేసుకోవచ్చని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల తర్వాత దీనిపై తుది తీర్పు ఇస్తామని పేర్కొంది. ముఖ్యమంత్రి కెసీఆర్ తోపాటు మంత్రులు కూడా ధర్నా చౌక్ ను ఎత్తేయటాన్ని పలుమార్లు సమర్థించుకున్నారు. ధర్నా చౌక్ ను ఎత్తేయటంపై పలు విమర్శలు వచ్చినా కెసీఆర్ సర్కారు ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో కొంత ప్రయోజన వ్యాజ్యం ద్వారా కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై పలు మార్లు వాదనలు విన్న హైకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నకెసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిరసనలను అణచివేసేలా కెసీఆర్ నిర్ణయం తీసుకోవటం విమర్శల పాలు అయింది. ఈ విషయంలో కెసీఆర్ ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన మరుసటి రోజు వచ్చిన ఈ మధ్యంతర ఆదేశాలు ఎన్నికల ప్రచారంలో కూడా కీలకంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఇది అధికార పార్టీకి ఇరకాటం అయితే..ప్రతిపక్షాల చేతికి మరో అస్త్రం అందినట్లు అయింది.

Next Story
Share it