Telugu Gateway
Top Stories

‘ట్రంప్’కు షాక్

‘ట్రంప్’కు షాక్
X

అడ్డగోలు నిర్ణయాలతో అందరినీ హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ తగిలింది. తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేక గాలి ఎదురైంది. మరి ఇప్పటికైనా దూకుడు తగ్గించుకుంటారా?. లేదంటే తన ‘రూట్’ అదేనంటారా?. వేచిచూడాల్సిందే. తాజా ఫలితాలు మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం వెల్లడైన మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల సభలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోగా.. ట్రంప్‌ రిపబ్లిక్‌ పార్టీ సెనేట్‌ లో మాత్రం ఆధిక్యం సాధించింది. ప్రతినిధుల సభలోని 435 స్థానాల్లో ఎన్నికలు జరగగా 419 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 223 స్థానాల్లో డెమోక్రాట్లు గెలుపొందగా, 196 స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు.

గతంలో రిపబ్లికన్లు గెలిచిన 28 స్థానాలను కూడా డెమోక్రాట్లు కైవసం చేసుకోవడంతో హౌస్‌లో డెమోక్రాట్లు మోజార్టీని పొందారు. ఇక సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్‌ పార్టీ ఎట్టకేలకు తమ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్‌ జరగగా.. 32 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలనంతరం సెనేట్‌లో రిపబ్లికన్లు 51 మంది, డెమోక్రాట్లు 46 మంది అయ్యారు. ఇందులో డెమోక్రాట్లు రెండు సీట్లను కోల్పోయారు. ఇక 36 రాష్ట్రాల గవర్నర్‌ పదవులకు ఎన్నికలు జరగగా ఇప్పటికి 33 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తాజా ఫలితాలతో డెమోక్రటిక్‌ గవర్నర్లు గతం కంటే ఏడుగురు పెరిగారు.

Next Story
Share it