Top
Telugu Gateway

‘సర్కారు’ మూవీ రివ్యూ

‘సర్కారు’ మూవీ రివ్యూ
X

ఓటు హక్కు ఎంత కీలకమో చెప్పే సినిమా సర్కారు. ఈ విషయంపై కమర్షియల్ సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందా?. అంటే ఖచ్చితంగా అనుమానమే అని చెప్పొచ్చు. మరి ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ ఎందుకంత సాహసం చేశారు?. ప్రముఖ హీరో విజయ్, తెలుగు, తమిళంలోనూ వరస హిట్లు కొడుతున్న కీర్తి సురేష్ జోడీగా నటించిన సినిమా దీపావళి సందర్భంగా మంగళవారం నాడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అంతా ఓటు చుట్టూనే తిరుగుతోంది. హీరో విజయ్ ఓ అగ్రశ్రేణి ఐటి కంపెనీ సీఈవో. ఆయన ఏ దేశంలో అడుగుపెడితే ఆ దేశంలో కంపెనీలు అన్నింటిని టేకోవర్ చేసి..విలీనం చేసుకుంటాడు. విజయ్ స్పీడ్ చూసి కొన్ని దేశాలు ఆయన్ను వాళ్ల దేశాలకు రాకుండా నిషేధం కూడా విధిస్తాయి. విజయ్ భారత్ కు వస్తున్నాడని తెలిసి దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలు అన్ని కూడా హడలిపోతాయి. ఆయన టార్గెట్ ఏ కంపెనీ అవుతుంది. తమ వరకూ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై కంపెనీలు హడావుడిగా సమావేశాలు పెట్టుకుని ప్రతివ్యూహాలు రచించుకునే పనిలో పడతాయి.

కానీ విమానాశ్రయంలో దిగిన వెంటనే తాను కేవలం ఓటు వేయటానికి మాత్రమే భారత్ కు వచ్చానని..కంపెనీలు ఏవీ ఖంగారు పడాల్సిన అవసరం లేదని ప్రకటిస్తారు. తీరా ఓటు వేయటానికి పోలింగ్ బూత్ కు వస్తే ఆయన ఓటు ఎవరో వేసేస్తారు. సినిమా కథ అక్కడే మలుపు తిరుగుతుంది. దీనిపై న్యాయ పోరాటం చేయటం...తన ఓటు హక్కును విజయ్ ఎలా సాధించుకుంటాడు..విజయ్ తో పాటు ఏకంగా మూడు లక్షల మందికి పైగా తమ ఓట్లను దొంగ ఓట్లు వేశారని..తమకూ చట్టంలోని 49 పీ ప్రకారం హక్కు కావాలంటూ కోర్టును ఆశ్రయిస్తారు. దీంతో ఎన్నికైన కొత్త పార్టీని ప్రమాణ స్వీకారం చేయకుండా కోర్టు అడ్డుకుని... ఏకంగా మళ్ళీ ఎన్నికలకు ఆదేశాలు జారీ చేస్తుంది. తొలుత కేవలం ముఖ్యమంత్రి అభ్యర్ధిపైనే పోటీకి దిగాలని విజయ్ నిర్ణయించుకుంటాడు. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను బరిలోకి దింపుతారు.

ఈ సినిమాలో ముఖ్యమంత్రి కుమార్తెగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్, విజయ్ ల మధ్య వచ్చే ఎత్తులు..పై ఎత్తులు ఆసక్తికరంగా మారతాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. సర్కారు సినిమాలో విజయ్ తన యాక్షన్ తో ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ కు పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రే దక్కింది. రాజకీయ వ్యూహాలు..ప్రజా సమస్యలను రాజకీయాలు పరిష్కరించకుండా ఎందుకు వదిలేస్తారు అనే అంశాన్ని సర్కారు సినిమాలో దర్శకుడు మురుగదాస్ మంచి ప్రయత్నం చేశారు. అయితే కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ లేకపోవటంతో ‘సర్కారు’ సినిమా కూడా ప్రభుత్వంలా ‘అందరికీ’ చేరువ కావటం కష్టమే.

రేటింగ్. 2.5/5

Next Story
Share it