కెసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. చీప్ లిక్కర్ సీఎం కంటే సీల్డ్ కవర్ సీఎం నయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు, హరీష్‌రావుకు మధ్య తీవ్ర విభేదాలున్నాయని, హరీష్‌తో మాట్లాడిన తర్వాత గజ్వేల్ నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. మినిస్టర్ క్వార్టర్స్ లో గత నెల 25వ తేదీ సీసీ ఫుటేజి బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కారు డ్రైవర్‌ను మార్చాలని హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మామా అల్లుళ్ల మధ్య విభేదాలు పెచ్చుమీరాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలయికను తప్పుపట్టడం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. టీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు తీవ్రమవుతున్నాయని, ఏ క్షణమైనా ఆ పార్టీలో అంతర్గత కుట్రలు బయటపడే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటించిన 105 మంది టీఆర్‌ఎస్ అభ్యర్ధుల్లో 40 మంది ఎట్టి పరిస్ధితిల్లోనూ గెలవరని, మిగిలిన 20 సీట్ల కోసం తాము ప్రయత్నిస్తామని అన్నారు.