Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణలు

రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణలు
X

తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కొడంగ‌ల్ టీఆర్ఎస్ అభ్య‌ర్ధి నివాసంలో దొరికింది 17.51 కోట్ల రూపాయ‌లు అయితే..ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి మాత్రం కేవ‌లం 55 లక్షలే అని చెబుతున్నార‌ని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్య‌ర్ధి నివాసం ఉండే ప్రాంతంలో భారీ ఎత్తున న‌గ‌దు ప‌ట్టుబ‌డ‌టంతోపాటు...ఎన్నిక‌ల కోసం ఎవ‌రెవ‌రికి ఎంతెంత డ‌బ్బు ఇచ్చార‌నే లెక్క‌ల‌తో కూడిన డైరీ కూడా దొరికింద‌ని..కానీ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు రానివ్వ‌టం లేద‌ని తెలిపారు. విష‌యం తెలిసిన వెంట‌నే ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు ప్ర‌ధాన మంత్రి కార్యాయంలోని అధికారుల‌తో మాట్లాడి ఐటి అధికారుల‌పై ఒత్తిడి తెచ్చి వివ‌రాలు బ‌య‌ట‌కు రాకుండా చేస్తున్నార‌ని రేవంత్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాకుండా త‌న‌ను తనను అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని చెప్పారు.

కేంద్ర భద్ర‌తా సిబ్బందితో తనకు సెక్యూరిటీ ఇవ్వమని కోర్టు చెప్పినా.. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ అన్ని రకాలుగా ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. తమిళనాడులోని ఆర్కేనగర్‌ తరహాలో కొడంగల్‌‌లో కూడా ఎన్నిక వాయిదా వేయించడానికి టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని అన్నారు. కేసీఆర్ పంపిస్తున్న నగదును సరఫరా చేయడానికి డీజీపీ మహేందర్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. డీజీపీ, డీఐజీ, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావును తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల మీద తనకు నమ్మకం లేదన్నారు. కొడంగల్‌పై మీడియా కూడా డేగ కన్ను పెట్టాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it