Telugu Gateway
Politics

లక్ష ఉద్యోగాలు...రెండు లక్షల రూపాయల రుణ మాఫీ

లక్ష ఉద్యోగాలు...రెండు లక్షల రూపాయల రుణ మాఫీ
X

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ. ఒకేసారి రైతులకు రెండు లక్షల రూపాయల మేర రుణ మాఫీ. పెన్షన్ దారుల వయస్సును 60 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గింపు. ఇలాంటి కీలక అంశాలతో ఇటీవల వరకూ మహాకూటమిగా కొనసాగిన ‘ప్రజాఫ్రంట్’ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ ల ఉమ్మడి ప్రణాళికగా దీన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ సీనియర్ నేత పల్లా వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హామీల అమలు కమిటీకి కోదండరాం ఛైర్మన్ గా ఉంటారని ప్రకటించారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తామన్నారు. నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. తమ ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యం ఉంటుందని..అన్ని వర్గాలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో చిన్నాభిన్నమైన అన్ని వ్యవస్థలను పటిష్టం చేసే ​విధంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపిందించామని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ది విస్తరిస్తామని తెలిపారు.

పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయరంగం బలోపేతం, సంక్షేమ రంగాన్ని సైతం మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన కూటమికి ‘ప్రజా ఫ్రంట్‌’గా నామకరణం చేశారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఇక నుంచి అందరూ అలాగే అభివర్ణించాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు ఒప్పుకున్న వాటిని కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంను విడుదల చేస్తున్నామన్నారు. అందరి ఆశీర్వాదంతో తమ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోదండరాం కన్వీనర్‌గా కేబినెట్‌ హోదాలో మేనిఫేస్టో అమలుకు కృషి​ చేస్తారని ఉత్తమ్‌ తెలిపారు. విధానపరమైన డాక్యుమెంట్‌ అని ఎన్నికల నాటికి అవసరమైన మరిన్ని జోడించి ప్రజల్లోకి వెళతామని రమణ వివరించారు. కామన్‌ మేనిఫెస్టోతో ప్రజలకు జవాబుదారీ భరోసా కల్పిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. వంద యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రతిపాదించారు.

Next Story
Share it