Telugu Gateway
Telangana

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలో బాలయ్య!

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలో బాలయ్య!
X

తెలుగుదేశం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారా?. అంటే అవుననే చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. నవంబర్ 20 నుంచి ఆయన ప్రచారం ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి అభ్యర్ధుల తరపున బాలకృష్ణ ఈ ప్రచారంలో పాల్గొననున్నారు. బాలకృష్ణ తెలంగాణలో ప్రచారం కోసం పది రోజులు సమయం కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆయన ఓ సారి ఖమ్మం జిల్లాలోని మధిరలో పర్యటించి వచ్చారు. ఇప్పుడు ఎంపిక చేసిన చోట్ల బాలకృష్ణ ప్రచారం సాగనుంది. బాలకృష్ణ సిఫారసుతోనే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోని శేరిలింగపల్లి సీటును భవ్య ఆనందప్రసాద్ కు కేటాయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ లెక్కన బాలకృష్ణ ఖచ్చితంగా శేరిలింగంపల్లిలో విస్తృతంగా ప్రచారం చేయటం ఖాయంగా చెబుతున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ పూర్తిగా తెలుగుదేశం అభ్యర్ధుల తరపునే ప్రచారం నిర్వహిస్తారా?. లేక కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున కూడా ప్రచారం నిర్వహిస్తారా? అన్నది చూడాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు కలసి గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ మాత్రం తెలంగాణ ప్రచారానికి దూరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it