తెలంగాణలో ఇద్దరు గెలిచే అభ్యర్ధుల పేర్లు చెప్పిన లగడపాటి
ఓ వైపు తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్ లో సాగుతున్న తరుణంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ ఎన్నికలకు సంబంధించిన సంచలన విషయాలు బహిర్గతం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు గెలిచే అభ్యర్ధుల పేర్లను వెల్లడించారు. వాళ్లిద్దరూ ఇండిపెండెట్లు కాబట్టే ధైర్యంగా వారి పేర్లు చెబుతున్నానని..తాను కూడా ఏ పార్టీకి చెందిన వాడిని కాదన్నారు. ప్రధాన పార్టీల ప్రలోభాలను కాదని..తెలంగాణ ఓటర్లు స్వతంత్రులకు ఓట్లు వేయబోతున్నారని..ఈ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది స్వతంత్రులు గెలిచే అవకాశం ఉందని వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్ లు గెలవబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచే ఇండిపెండెంట్ అభ్యర్ధుల పేర్లు ఇలా రోజుకు రెండు చెబుతానని..అన్ని విషయాలు డిసెంబర్ 7నే వెల్లడిస్తానని తెలిపారు. తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత లగడపాటి ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు.