రేవంత్ రెడ్డికి కెటీఆర్ సవాల్

తెలంగాణ ఎన్నికల ప్రచార హీట్ పెరిగింది. నేతలు సవాళ్ళు..ప్రతిసవాళ్ళు విసురుకుంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన నామినేషన్ సందర్భంగా ఏకంగా సీఎం కెసీఆర్ కే సవాల్ విసిరారు. పట్నం నరేందర్ రెడ్డి కాదు..కెసీఆర్ కొడంగల్ లో వచ్చి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఈ సారి మంత్రి కెటీఆర్ వంతు వచ్చింది. ఆయన బుధవారం నాడు కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి దమ్ముంటే టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మీద గెలవాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి గాలి మాటలు వదిలి అభివృద్ది పనులు చేసి చూపించాలన్నారు. కాంగ్రెస్ దొంగల పార్టీ అని, మహాకూటమిని చిత్తుగా ఓడించాలని కోరారు. అభివృద్ది కావాలంటే కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. సీల్డ్ కవర్ సీఎం కావాలో.. ప్రజల మధ్య ఉంటే సీఎం కావాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. కృష్ణా నీళ్లు కొడంగల్ రావాలంటే నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.