Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ కు మరో షాక్

టీఆర్ఎస్ కు మరో షాక్
X

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలమే అంతంత. ఇప్పుడు ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీఆర్ఎస్ సీనియర్‌ నేత, ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్ (ఐడీసీ), ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బుడాన్‌ బేగ్‌ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. గత కొంత కాలంగా పార్టీకి ఆయన దూరంగానే ఉంటున్నారు. ఎన్నికల వేళ బేగ్‌ తాజా నిర్ణయంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న బేగ్‌తో మహాకూటమి నేతలు ఇప్పటికే మంతనాలు జరిపినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బేగ్‌ ప్రస్తుతం ఐడీసీ ఛైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. ఖమ్మంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడు రాజీనామాతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు.

బుడాన్‌ రాజీనామా వార్తలతో వెంటనే అప్రమత్తమైన టీఆర్ఎస్ అధిష్టానం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. బేగ్‌ టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్‌, టీడీపీ మధ్య పోరు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌పై మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును మహాకూటమి బరిలో నిలిపింది. నామాకు మద్దతుగా మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ప్రచారంలోకి దిగడంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మైనార్టీల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు రేణుక, నామా నాగేశ్వరరావులు ఈ వ్యూహాం రచించినట్లు సమాచారం.

Next Story
Share it