Telugu Gateway
Telangana

కెసీఆర్ వ్యాఖ్య‌లు భావోద్వేగ బెదిరింపులా?

కెసీఆర్ వ్యాఖ్య‌లు భావోద్వేగ బెదిరింపులా?
X

నిన్న మొన్న‌టి వ‌ర‌కూ వంద సీట్ల‌కు త‌గ్గ‌వంటూ బీరాలు ప‌లికిన తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) అధినేత కెసీఆర్ స‌డ‌న్ గా ఎందుకంత బేల‌గా మాట్లాడారు?. కెసీఆర్ వంటి నాయ‌కుడి నోట‌..ఓట‌మి మాట‌లు రావ‌టం వెన‌క కార‌ణం ఏంటి?. ప్ర‌చారానికి వెళ్లిన ప్ర‌తి చోటా గెలుస్తామ‌ని చెబుతూనే టీఆర్ఎస్ ఓడిపోతే త‌న‌కేమీ న‌ష్టం లేద‌ని..ఇంట్లో ప‌డుకుని రెస్ట్ తీసుకుంటామ‌ని ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ బ‌హిరంగ స‌భ‌లోని వ్యాఖ్యానించ‌టం వెన‌క మ‌త‌ల‌బు ఏంది?. కెసీఆర్ వ్యాఖ్య‌లు ఏకంగా టీఆర్ఎస్ నేత‌ల‌ను కూడా విస్మ‌యానికి గురిచేశాయి. కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్ లో మీట్ ద ప్రెస్ లో మాట్లాడిన మంత్రి కెటీఆర్ కూడా తాము గెల‌వ‌క‌పోతే...ఎవ‌రికీ క‌న‌ప‌డం..విన‌ప‌డం అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉంటే క‌న్పిస్తాం..లేదంటే లేదు అనే త‌ర‌హాలో ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. కెసీఆర్ ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలోఎక్కువ శాతం సెంటిమెంట్ నే న‌మ్ముకున్న‌ట్లు క‌న్పిస్తోంది. అందులో భాగంగానే ఆయ‌న ప్ర‌ధానంగా ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబుపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను రెచ్చ‌గొట్ట‌డం ద్వారా మ‌రోసారి పీఠం దక్కించుకోవాల‌నే వ్యూహం అమలు చేస్తున్నారు.

అందుకే అస‌లు ప్రత్య‌ర్ధి అయిన కాంగ్రెస్ పార్టీ కంటే కేవ‌లం 14 సీట్లు పోటీ చేసే టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. అదే 94 సీట్ల‌లో బ‌రిలో నిలిచిన కాంగ్రెస్ ను కాకుండా..కాంగ్రెస్ ద్వారా చంద్ర‌బాబు తెలంగాణ‌లోకి వ‌స్తున్నార‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కెసీఆర్ స‌భ‌ల‌కు హాజ‌రైన జ‌నంలోనూ ఎక్క‌డ జోష్ క‌న్పించ‌టం లేదు. స‌భ‌ల్లో కెసీఆర్ ప్ర‌త్యేకంగా కోరితే త‌ప్ప‌..ప్ర‌జ‌లు దేనికీ స్పందించ‌టం లేదు. ఉద్య‌మ స‌మ‌యంలో ఉండే జోష్ వేరు. ప‌థ‌కాల ప‌రంగా స‌ర్కారు తీరు బాగానే ఉన్నా..ప‌లు విష‌యాల్లో అటు కెసీఆర్, ఇటు మంత్రి కెటీఆర్ ప్ర‌జ‌ల‌కే కాకుండా...ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కూడా దూరం అయ్యార‌ని పార్టీ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాం అనే కెసీఆర్ వ్యాఖ్య‌లు భావోద్వేగ బెదిరింపుల త‌ర‌హాలో ఉన్నాయ‌ని ఓ నేత వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఖానాపూర్ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ ఎటాక్ ప్రారంభించింది.

Next Story
Share it