Telugu Gateway
Politics

106 సీట్ల నుంచి..మీరే నన్ను కాపాడాలి వరకూ!

106 సీట్ల నుంచి..మీరే నన్ను కాపాడాలి వరకూ!
X

వంద కాదు. టీఆర్ఎస్ కు 106 సీట్లు వస్తున్నాయి. ఎవరూ ఆగం కావాల్సిన అవసరం లేదు. ప్రజలకు అన్నీ తెలుసు. తాజా సర్వేలోనే ఈ సంఖ్య వచ్చింది. ఇదీ ఎన్నికల ప్రచార సభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ మాటలు. కానీ అంతలోనే సీన్ రివర్స్. మంగళవారం నాడు ఆమనగల్లులోని బహిరంగ సభలో మాట్లాడుతూ ‘బక్కపల్చని ఒక్క కెసీఆర్ ను కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐలు ఒక్కటయ్యాయి. మీరే నన్ను కాపాడాలి.’. అని వ్యాఖ్యానించారు. కెసీఆర్ బక్కగా ఉన్నాడని తెలంగాణలో ఇక ఎవరూ ప్రచారం చేయరా?. గత ఎన్నికల్లో వీళ్లంతా ప్రచారానికి రాలేదా?. ఇందులో కొత్తగా వచ్చింది ఎవరు ఉన్నారు?. బక్కగా ఉన్న తనపై అందరూ కలసి రాజకీయ దాడి చేస్తున్నారని చెప్పటం ద్వారా మరో ‘సెంటిమెంట్’ అస్త్రం ప్రయోగమా?. అంతే కాదు...నాలుగున్నర సంవత్సరాల పాలన తర్వాత కెసీఆర్ మొదటి సారి ‘తప్పులుంటే సరిచేసుకుందాం. మాట్లాడుకుందాం’ అని వ్యాఖ్యానించారంటే ఆయన ఎంత టెన్షన్ లో ఉన్నారో తెలుస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతే కాదు..పరాయి పాలనలోకి పోవద్దని కెసీఆర్ వ్యాఖ్యానించటం మరింత ఆసక్తికర పరిణామంగా ఉంది.

తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే వారంతా ఇక్కడి పౌరులు...ఓటర్లే కదా?. అంటే వేరే పార్టీ అధికారంలోకి వస్తే అది పరాయి పాలన అవుతుందా?. గెలుపుపై నమ్మకం సన్నగిల్లటం వల్లే కెసీఆర్ సెంటిమెంట్ రాజేసేందుకు రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కెసీఆర్ ఎంతో టెన్షన్ లో ఉన్నారని చెప్పేందుకు ఉదాహరణలు ఎన్నో. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన నిరుద్యోగ భృతి అసలు అమలు సాధ్యం కాదని..ఎంత మందికి ఇస్తారు..అసలు లెక్క ఎలా తేలుస్తారు అంటూ ప్రశ్నించిన కెసీఆర్ తర్వాత ఇదే స్కీమ్ ను కాంగ్రెస్ ప్రకటించిన మొత్తం కంటే మరో 16 రూపాయలు జత చేసి మరీ తాత్కాలిక మ్యానిఫెస్టోలో ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే కెసీఆర్ కూడా అదే నినాదం అందుకున్నారు.

అధికారంలో ఉన్నంత కాలం ఉద్యోగులు ఈ ప్రతిపాదన ఆయన ముందు పెట్టినా ససేమిరా అన్నారు. కానీ ఎన్నికల సమయం కావటంతో కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే ఆయన కూడా ‘సై’ అంటూ ముందుకొచ్చారు. ఇలా కెసీఆర్ ప్రత్యర్ధి పార్టీల హామీలు ఎక్కడ దెబ్బతీస్తాయో అన్న భయంతో వాళ్ళు ఏది ప్రకటిస్తే దానికి మేమూ రెడీ అంటూ ముందుకు వస్తున్నారు. ఒక్క రైతు రుణ మాఫీ విషయంలోనే లక్ష రూపాయల దగ్గర ఆగిపోయారు. చూడాలి మరి తెలంగాణ ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారో.

Next Story
Share it