Telugu Gateway
Telangana

కెసీఆర్ అనుకున్నదొకటి..అయిందొకటి!

కెసీఆర్ అనుకున్నదొకటి..అయిందొకటి!
X

అలా అసెంబ్లీని రద్దు చేసి..ఇలా ఎన్నికలకు వెళ్లి..మళ్లీ వెంటనే సీఎం సీట్లో కూర్చోవాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కెసీఆర్ ప్లాన్ చేశారు. కానీ ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరగటం లేదు. అసెంబ్లీ రద్దు అయి సరిగ్గా రెండు నెలలు గడిచిపోయింది. కెసీఆర్ అసలు ప్లాన్ కాంగ్రెస్, టీడీపీలకు ఎక్కువ సమయం ఇవ్వకూడదనుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీతోపాటు..అవసరమైన చోట బాగానే లాబీయింగ్ చేసుకున్నారు. లాబీయింగ్ ప్రయత్నాలు అయితే ఫలించాయి కానీ..కాంగ్రెస్ కు కావాల్సినంత సమయం దొరికింది. అసెంబ్లీ రద్దు అయి...టీఆర్ఎస్ 119 సీట్లకు గాను 105 సీట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టినా..ఇంత వరకూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా కూడా బయటకు రాలేదు. దీని వల్ల రెండు లాభాలు. ఒకటి ఎన్నికల ఖర్చు తగ్గటం ఒకటి. కావాల్సినంత సమయం తీసుకుని ‘సర్దుబాట్లు’ చేసుకోవాల్సిన చోట అల్లా సర్దుబాటు చేసుకునే వెసులుబాటు దక్కింది ఆ పార్టీకి.

నవంబర్ నెలలోనే ఎన్నికలు పూర్తయి పోతాయి..కాంగ్రెస్ పార్టీ కూటమికి సమయం చాలదని ప్లాన్ వేసుకున్నారు కెసీఆర్. కానీ తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు..తుది జాబితా సిద్ధం కాకపోవటం..కోర్టు కేసులు తదితర అంశాల కారణంగా ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో చివరి షెడ్యూల్ కు తెలంగాణ ఎన్నికలు చేరాయి. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్ పార్టీలకు తగినంత సమయం దొరికింది. ఇది టీఆర్ఎస్ కు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఓ వైపు టీఆర్ఎస్, మరో వైపు కాంగ్రెస్ ప్రచారం హోరెత్తిస్తుంటే ఆ పరిస్థితి వేరే ఉండేది. ప్రస్తుతం ఫీల్డ్ లో కేవలం టీఆర్ఎస్ నేతలే ఉండటం..పలు చోట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవతుండటంతో ఈ వార్తలు ప్రాముఖ్యతకు నోచుకుంటున్నాయి.

ఆ నోటా ఈ నోటా అవి విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇది అధికార పార్టీకి చేటు చేస్తోంది. అసెంబ్లీ రద్దు నాటి అనుకూల పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రం లేదనే వాదనలు పుట్టుకొస్తున్నాయి. అదే ఎన్నికలకు సమయం తక్కువ ఉండి ఉంటే..అసలు ఈ చర్చకు పెద్దగా స్కోప్ ఉండేది కాదు. పైగా అసలు అసెంబ్లీ రద్దుకు సహేతకమైన కారణం ఏంటో కూడా ఇప్పటివరకూ అధికార పార్టీ నేతలు చెప్పటం లేదు. కేవలం కేసులు వేస్తున్నారని అసెంబ్లీ రద్దు చేశామవంటే దానికి ప్రజల నుంచి ఆమోదం వస్తుందా?. అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు. దీనికి తోడు టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు కూడదీసుకునేందుకు ప్రత్యర్దులకు మంచి ఛాన్స్ దక్కినట్లు అయింది.ఎన్నికలకు ఇంకా సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. మరి కెసీఆర్ ముందస్తు ప్రయత్నం అంతిమ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 11 వరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it