హాట్ టాపిక్ గా గజ్వేల్ రాజకీయం
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గజ్వేల్’ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కొద్ది రోజుల క్రితం కెసీఆర్ ను ఎలాగైనా ఓడించాలని మంత్రి హరీష్ రావు తనను కోరారని ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి పెద్ద కలకలం రేపారు. ఈ విషయంలో తాను ఎక్కడైనా ప్రమాణం చేస్తానని ప్రకటించారు. దీనిపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆధారాలు ఉంటే చూపాలని..లేదంటే కేసు ఎదుర్కోవటానికి రెడీగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పుడు మరోసారి గజ్వేల్ హాట్ టాపిక్ గా మారింది. పోలీసు యంత్రాంగంతో పాటు అందరూ టీఆర్ఎస్ అభ్యర్ధి కెసీఆర్ కు సహకరిస్తున్నారని..ఇలాగైతే నిష్పక్షపాత ఎన్నికలు ఎలా జరుగుతాయంటూ ఒంటేరు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆయన ఆందోళనను భగ్నం చేయటం...తర్వాత ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఆరోగ్యం క్షీణించటంతో హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. సోమవారం నాడు ఒంటేరు సచివాలయంలో ఎన్నికల సంఘం అధికారులను కలసి ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు.
కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్న వేలకోట్ల రూపాయలను పోలీసులు ఎందుకు సీజ్ చేయ్యట్లేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులు, ఎన్నికల అధికారులు తనను వేధిస్తున్నారని, వారి తీరులో మార్పు రాకుంటే గజ్వేల్ ఆర్వో కార్యాలయం ముందు ఆత్మ బలిదానం చేసుకుంటానని ఒంటేరు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ఇరవై ఏళ్లుగా పోరాడుతున్న తనపై కేసీఆర్ సీఎం అయ్యాక తనపై 27 కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజలను కాపాడటానికి ఉన్నారా లేక టీఆర్‌ఎస్ నేతల కోసం పనిచేయడాని ఉన్నారా అని మండిపడ్డారు. ప్రజలందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తూ హరీష్ రావు గల్లీ లీడర్ అయ్యాడని.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపించేందుకు ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డి చర్యలను టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉందని అందుకే ఈ డ్రామాలు అని ఆయన విమర్శించారు. కెసీఆర్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.