Telugu Gateway
Andhra Pradesh

సుజనా కంపెనీల గోల్ మాల్ లో మాజీ సీఎస్ తనయుడు!

సుజనా కంపెనీల గోల్ మాల్ లో మాజీ సీఎస్ తనయుడు!
X

ఆర్థికంగా ఎదగాలంటే బాగా పేరున్న వ్యక్తులతో పరిచయం అవసరం. ఉన్నతాధికారులతో సంబంధాలు కీలకం. అవసరం అయితే ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉన్న వారి పిల్లలకు భారీ ఎత్తున వేతనాలు ఇచ్చి కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వటం ఒకెత్తు. తర్వాత వాళ్ళతోనే కొన్ని కంపెనీలు పెట్టించటం. అదే కంపెనీల నుంచి బ్యాంకుల ద్వారా వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకోవటం. అందులో ఎంతో కొంత ఈ హై ప్రొఫెల్ అధికారుల తనయులకు ముట్టచెప్పటం. అలా అందరి పనీ అయిపోతుంది. సాఫీగా సాగినంత కాలం ఓకే. ఎక్కడైనా రివర్స్ కొడితేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి బిజినెస్ మోడల్ ఇదే. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అచ్చం ఇదే మోడల్ ఫాలో అయ్యారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సుజనా చౌదరి భారీ ఎత్తున కంపెనీల ఏర్పాటు..ఆ కంపెనీల ద్వారా బ్యాంకు రుణాలు పొందటం వంటి వ్యవహారాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మాజీ ప్రధాన కార్యదర్శి తనయుడు కూడా పాత్రదారుడిగా ఉన్నట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన పేరిట కూడా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసి..లబ్దిపొందినట్లు చెబుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దాడుల సమయంలో మాజీ సీఎస్ తనయుడు కూడా ‘అసలు విషయాలను’ బహిర్గతం చేసినట్లు సమాచారం. అయితే సుజనా కంపెనీల్లో ఉన్నంత కాలం మాజీ సీఎస్, ఆయన తనయుడు కూడా భారీగా లబ్దిపొందినట్లు చెబుతున్నారు. సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు తనయుడు కె. శ్రీనివాస కళ్యాణ్ రావు కూడా సీబీఐ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఎండీగా వ్యవహరించిన ఆయన కూడా ఇలాంటి స్కాంలోనే ఇరుక్కున్నారు. ఇందులో కూడా సుజనా చౌదరి పాత్ర ఉందని, ఈ సంస్థ రుణాలు తీసుకోవటం వెనక కూడా ఆయనే పాత్రదారి అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు దీంతో తన కుమారుడికి ఎలాంటి సంబంధంలేదని..విచారణలో అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సీఎస్ లు, సీబీఐ డైరక్టర్లు..ఈడీ అధికారులు, ఐటి శాఖ వంటి కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారి పిల్లలు లేదా సమీప బంధువులతో ఇలా కంపెనీలు పెట్టించి భారీ ఎత్తున బ్యాంకు రుణాలు తీసుకుని సుజనా చౌదరి ఆస్తులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈడీ ఈ కేసుకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేసిన తర్వాత ఈడీ తప్పు చేసిందని..అసలు ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే..మరో వైపు తనకు అప్పుల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని మీడియాతో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Next Story
Share it