Telugu Gateway
Andhra Pradesh

మెఘా..నవయుగాకు 4698 కోట్ల పనులు పంచేశారు

మెఘా..నవయుగాకు 4698 కోట్ల పనులు పంచేశారు
X

ఎన్ని విమర్శలు వచ్చినా డోంట్ కేర్. ఎన్ని ఆరోపణలు వచ్చినా మాకేంటి?. మేం అనుకున్నట్లే చేస్తాం. మమ్మల్ని అడ్డుకునేది ఎవరు?. మాకు కావాల్సిన కంపెనీలకే పనులిస్తాం. అంతా మా ఇష్టం అన్నట్లు ఉంది ఏపీ సర్కారు తీరు. మా రాష్ట్రంలో ఐటి దాడులకు నో పర్మిషన్. సీబీఐకి నో ఎంట్రీ. ఎందుకనుకుంటున్నారు?. మా ప్రభుత్వంలో మాకు నచ్చినట్లు చేసుకునే స్వేచ్చ లేదా?. మాకు నచ్చిన కంపెనీలకు వేల కోట్ల రూపాయల పనులు ఇచ్చి వందల కోట్ల రూపాయల కమిషన్లు తీసుకునే స్వేచ్చ లేదా? అన్నట్లు ఉంది ఏపీ సర్కారు తీరు. పెన్నా-గోదావరి అనుసంధాన పనులను కూడా ముందు చెప్పుకున్నట్లుగానే ఏపీ సర్కారు అస్మదీయ కంపెనీలైన మెఘా ఇంజనీరింగ్, నవయుగా సంస్థలకు పనులు అప్పగించేసింది. 4698 కోట్ల రూపాయల పనులను రెండు కంపెనీలకు పంచేశారు. గత సోమవారం నాడు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీవోటి) క్లియర్ చేశారు. సీవోటిపై కూడా ఒత్తిడి చేసి మరీ ఈ పనులు పూర్తి చేయించారు.

సర్కారు వ్యూహాత్మకంగా రెండు కంపెనీలకూ ఎక్సెస్ సీలింగ్ వరకు అనుమతించి ఓకే చేయించారు. ఈ ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి ఒప్పందాలు ఇంకా కుదరాల్సి ఉంది. కమిషన్ల మొత్తం చేతులు మారిన తర్వాతే అగ్రిమెంట్లు జరుగుతాయని సాగునీటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. పెన్నా-గోదావరి అనుసంధాన పనులకు ఈ నెల 26న సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు చెబుతున్నారు. సాక్ష్యాత్తూ ప్రభుత్వ పెద్దలే నేరుగా రంగంలోకి దిగి..ఈ పనుల పంపకం పూర్తి చేసినట్లు చెబుతున్నారు. మెఘా ఇంజనీరింగ్ కు ఏపీలో ఇఫ్పటికే 12వేల కోట్ల రూపాయల వరకూ పనులు అప్పగించిన విషయం తెలిసిందే. నవయుగా సంస్థకు భారీ ఎత్తున పనులు అప్పగింత జరిగింది. ఓ వైపు సాగునీటి శాఖతోపాటు పలు శాఖల్లోనూ ప్రభుత్వ పెద్దల సిఫారసుల ప్రకారమే టెండర్లు ఖరారు అవుతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా రాష్ట్రంలో అడుగుపెట్టి పని చేసే పరిస్థితి లేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ లో సక్సెస్ ఫుల్ బిడ్డర్ గా నిలిచిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)నే సాక్ష్యాత్తూ ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.

Next Story
Share it