Telugu Gateway
Movie reviews

‘అదుగో’ అటువైపు చూశారో!?

‘అదుగో’ అటువైపు చూశారో!?
X

రవిబాబు. విలక్షణ నటుడు..దర్శకుడు కూడా. సహజంగా ఏదో ఒక కొత్తదనం చూపించాలనే తపన ఉన్న వ్యక్తి. అలాంటి రవిబాబు సడన్ గా ఓ సారి ‘పందిపిల్ల’ తో ముందుకొచ్చి సినిమా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు పందిపిల్లతో సినిమా ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. సినిమా ఎప్పుడో ప్రారంభించినా..కారణాలేంటో కానీ..విడుదల ఆలశ్యం అయింది. అదుగో సినిమా మొత్తాన్ని కేవలం ‘పంది’ పిల్లతోనే నడిపించే ప్రయత్నం చేశారు. అయినా అది ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పైగా విలన్ గ్రూప్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను చిర్రెత్తిస్తాయని చెప్పొచ్చు. ఓ విలన్ నిత్యం పాన్ పరాగ్ తింటూ తన పక్కనే ఉండే వాళ్ళ మీదే ఊస్తూ ఉంటాడు. ఈ సీన్లు వచ్చినప్పుడు సినిమా చూస్తున్నవారంతా అసహనంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

గ్రాఫిక్స్ తో పందిపిల్ల హంగామా తప్ప..ఏ దశలో సినిమా పర్వాలేదు అన్పించే పరిస్థితి కన్పించదు. అన్నీ తానై ‘అదుగో’ను తెరకెక్కించిన రవిబాబు ఈ సినిమాలో ఓ విలన్ క్యారెక్టర్ చేశాడు. అది కూడా అంతే గందరగోళంగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా పూర్తి లైవ్‌ 3డీ యానిమేషన్‌తో తెరకెక్కిన సినిమాగా ప్రచారం చేసుకున్నా సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం తలబొప్పి కట్టడం ఖాయం. రెండు రౌడీ గ్యాంగులు రాజధాని అమరావతిలో వేల ఎకరాల భూములు కొనటం..దాన్ని ప్రత్యర్ధులు దక్కించుకోవాలని చూడటం. ఆ వివరాలన్నింటిని సేకరించి ఓ చిప్ లో భద్రపర్చటం..రౌడీల పోరాటంలో ఈ చిప్ ను అరటిపండులో పెట్టగా..దాన్ని పందిపిల్ల తినటం.

అంతా అర్థంపర్ధం లేని సీన్లతో గందరగోళంగా సాగుతుంది అంతా. ఈ సినిమాలో యానిమల్‌ రేసింగ్‌లలో బెట్టింగ్‌లు పెడుతూ దందాలు చేస్తుంటారు. ఇది కూడా ఏ మాత్రం ఆసక్తి కలిగించకపోగా..చికాకు పుట్టిస్తుంది. ఈ సినిమాలో హీరో..హీరోయిన్లుగా నటించిన అభిషేక్ వర్మ, నభా నటేష్ లు కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు కూడా ఏ మాత్రం పండవు. ఓవరాల్ గా చూస్తే ‘అదుగో’ వైపు వెళితే అయిపోయినట్లే లెక్క!.

రేటింగ్.1.5/5

Next Story
Share it