Telugu Gateway
Telangana

‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా టీఆర్ఎస్

‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా టీఆర్ఎస్
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎన్నికల వేళ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పలు చోట్ల పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులకు అసంతృప్తి సెగ తాకుతుంటే..మరో వైపు పార్టీ నేతలు పలువురు పార్టీని వీడుతున్నారు. ఇది గెలుపు అవకాశాలపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన పార్టీ నేతల్లో నెలకొంది. టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ‘టిఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. టిఆర్ఎస్ ఒక ప్రైవేటు లిమిడెట్ కంపెనీ మాదిరిగా మారింది. ప్రగతి భవన్ లో తెలంగాణ ద్రోహులు నిండిపోయారు. ఆ ద్రోహులు ఇవాళ కేబినెట్ లో ఉన్నారు. తెలంగాణవాదులను తరిమికొట్టిన వ్యక్తి మీ కేబినెట్ లో ఉంటారు. ఆయన ఇంటికి పోయి డిన్నర్లు, లంచ్ లు చేస్తారు. అటువంటి వ్యక్తిని కారులో తిప్పుకుంటారు’ అంటూ మీడియా ముందు మండిపడ్డారు. పార్టీనే నమ్ముకుని ఉన్న తనను కనీసం వివరణ కూడా కోరకుండా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా నేతలంతా ఎంపీ డి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేయమని కోరారు. కానీ చేయలేదు. కొండా సురేఖను సస్పెండ్ చేయలేదు. గిరిజనుడిని అయినందునే నాపై సస్పెన్షన్ వేటు వేస్తారా? అంటూ మండిపడ్డారు.

తెలంగాణ రాగానే వెంటనే గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు? ఏమైంది? డిఎస్సీ పెట్టండి అని కోరాను. అయినా డిఎస్సీ పెట్టలేదు. ఏజెన్సీ ఏరియాల్లో బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని కోరినా భర్తీ చేయలేదు. ఆరోజు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బ్యాక్ లాక్ పోస్టులతోపాటు తొమ్మిది, పదో తరగతి పాసైన వేలాది మంది గిరిజనులకు ఉద్యోగాలిచ్చిన ఘనత ఆయనకు దక్కుతది. మీరు కనీసం బ్యాక్ లాక్ పోస్టులపైనా భర్తీ చేయండి మీకు కూడా మంచి పేరొస్తదని నేను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు? ఏమైంది? దళితులకు ఇచ్చినట్లుగానే పేద గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు అదేమైంది? తెలంగాణ రాగానే గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాతామని కేసిఆర్ వందల సభల్లో చెప్పిండు. మరి ఇప్పటి వరకు ఎందుకు రిజర్వేషన్లు గిరిజనులకు ఇవ్వలేదు. గిరిజనులు అంటే మీకు అంత చిన్నచూపా? అని ప్రశ్నించారు.

Next Story
Share it