Telugu Gateway

భారతీయ యువతకు ఐటి కష్టాలు!

భారతీయ యువతకు ఐటి కష్టాలు!
X

ఐటి రంగంపైనే ఆశలు అన్నీ పెట్టుకుని..అమెరికాకు ఎగిరిపోదామనుకుంటున్నారా?. కాస్త ఆలోచించండి..ట్రంప్ మీ ఆశలకు గండి కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ముఖ్యంగా ఐటి కంపెనీలు ‘స్థానిక’ టాలెంట్ నే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే తన ఎన్నికల నినాదానికి అనుగుణంగానే పనిచేస్తున్నారు. నిపుణుల విషయంలో అగ్రశ్రేణి కంపెనీల అభ్యంతరాలను కూడా ఆయన ఏ మాత్రం ఖాతరు చేయటం లేదు. తాను అనుకున్న విధంగానే ముందుకెళుతున్నారు. హెచ్1 బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ రంగంలోకి దిగారు. ఇక నుంచి ఈ వీసా పొందాలంటే ఉపాధి, నైపుణ్యాలకు సంబంధించి నిర్వచనాలను కొత్తగా సిద్ధం చేయనున్నారు. అందులో అంత తేలిగ్గా హెచ్ 1బీ వీసా దక్కకుండా చర్యలు తీసుకోనున్నారు. దీని ద్వారా నిపుణులైన ఉద్యోగుల పేరుతో అమెరికా వచ్చే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించటమే లక్ష్యంగా ట్రంప్ పావులు కదుపుతున్నారు. అదే సమయంలో హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు రద్దు చేసేందుకు సిద్ధం అవుతోంది. అమెరికా హోంలాండ్ భద్రతా విభాగం ఈ విషయాలను బహిర్గతం చేసింది.

ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ ఐటి కంపెనీలు, ఇతర కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. భారత్ కు చెందిన ఐటి నిపుణులు ఎక్కువ మంది అమెరికా వెళ్లేందుకు హెచ్ 1 బీ వీసా మార్గాన్నే ఎంచుకుంటారు. కొత్త మార్పులు అమల్లోకి వస్తే ఈ సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం కన్పిస్తోంది. అయితే హెచ్ 1బీ వీసా కింద ఉద్యోగాలు పొందేవారికి యాజమానులు మంచి వేతనాలు చెల్లించేలా కొత్త చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలు విధించకుండా ఉండే అంశంపై ట్రంప్ సర్కారుతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.

Next Story
Share it