Telugu Gateway
Politics

తెలంగాణ ఎన్నికలకు ఓటర్ల జాబితా టెన్షన్

తెలంగాణ ఎన్నికలకు ఓటర్ల జాబితా టెన్షన్
X

తెలంగాణ ముందస్తు ఎన్నికల షెడ్యూల్ పై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకూ తుది జాబితా ప్రచురించవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తొలుత ముసాయిదా ప్రతిని హైకోర్టుకు..పిటీషనర్లకు అందజేయాలని ఆదేశించింది. దీంతో సోమవారం హైకోర్టు నుంచి ఏమి ఆదేశాలు వెలువడతాయా? అన్న ఉత్కంఠ పార్టీల్లో నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు శుక్రవారం నాడే ఈ అంశంపై విచారణ జరిపింది. రెండు పిటీషన్లను కొట్టేసిన హైకోర్టు..కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపింది.

ఓటర్ల జాబితా అక్రమాలపై ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది ఎన్నికల జాబితాపై స్టే విధించింది. ఈ నెల 8 వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వరాదని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల జాబితా, నోటిఫికేషన్ రిట్‌ ఫిటిషన్‌కు లోబడి ప్రకటించాలని సూచించింది. తుదిజాబితాను ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టకూడదని పేర్కొన్నారు. ఈనెల 8న కౌంటర్‌ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు జారీచేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో 70 లక్షల ఓట్ల మేరకు అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పలు ఆధారాలను కూడా తాము కోర్టుకు సమర్పించామని పిటీషనర్లు తెలిపారు.

Next Story
Share it