సీబీఐ నాగేశ్వరరావుకు సుప్రీం బ్రేకులు
సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాలపై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక డైరక్టర్ గా నియమితులైన నాగేశ్వరరావు ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవటానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆయన కేవలం పాలనాపరమైన అంశాలే చూస్తారని పేర్కొంది. గతంలో తీసుకున్న నిర్ణయాలను తమకు తెలియ చేయాని ఆదేశించింది. అదే సమయంలో సీబీఐ చీఫ్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలపై వచ్చిన ఆరోపణలపై విచారణను రెండు వారాల్లోగా
పూర్తి చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విధుల్లోంచి తమను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలోక్‌వర్మ, రాకేష్ ఆస్థానా సవాలు చేయడంతో వీటిపై సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో సీవీసీ ఈ విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం తమ ఆదేశాల్లో పేర్కొంది.
ఇన్వెస్టిగేషన్ అధికారిని సీబీఐ మార్చడంపై సీల్డ్ కవరులో నవంబర్ 12లోగా కోర్టుకు సమర్పించాలని కూడా సీజేఐ రంజన్ గొగోయ్ ఆదేశించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు సంబంధించి సెక్రటేరియట్ నోట్‌లో పేర్కొన్న ఆరోపణలపై రెండు వారాల్లోగా ఎంక్వయిరీ పూర్తి చేయాలన్నారు. న్యాయస్థానం సీవీసీ దర్యాప్తునకు 10 రోజులు గడవు నిర్దేశించి, సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీవీసీ దర్యాప్తు జరపాలని ఆదేశించింది. అయితే దీనితో సోలిసిట్ జనరల్ తుషార్ మెహతా విభేదించారు. దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన 10 రోజుల సమయం సరిపోదన్నారు. సీవీసీ దర్యాప్తును సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో జరిపే అంశంపైనా ఆయన విభేదించారు. దర్యాప్తునకు మూడు వారాల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే జస్టిస్ రంజన్ గొగోయ్... రెండు వారాల్లోనే దర్యాప్తు ముగించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు రిటైర్జ్ జడ్జి ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో సీవీసీ విచారణకు ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 12కు వాయిదా వేశారు. దీంతో సస్పెన్స్ నవంబర్ 12వ తేదీకి మారింది.