Telugu Gateway
Politics

రాఫెల్ ను వదలని రాహుల్

రాఫెల్ ను వదలని రాహుల్
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదస్పద ‘రాఫెల్ డీల్’ను ఏ మాత్రం వదలటం లేదు. ఈ డీల్ ద్వారా మోడీ ఏకంగా అంబానీ జేబులో 30 వేల కోట్ల రూపాయలు వేసేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంత అత్యవసరంగా ఫ్రాన్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆయన గురువారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అనిల్ అంబానీ కంపెనీ ఆప్ సెట్ భాగస్వామిగా ఉంటేనే ఒప్పందం ఖరారు చేసుకుంటామని భారత్ ప్రభుత్వం షరతులు పెట్టిన ఫ్రాన్స్ పత్రిక వెల్లడించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ తరుణంలో నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ పర్యటన ఆసక్తిని రేపుతోంది. మంత్రి ఈ సమయంలో దసాల్ట్‌ ఏవియేషన్‌ ఫ్యాక్టరీకే ఎందుకు వెళ్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. రాఫెల్‌ కాంట్రాక్ట్‌, దసాల్ట్‌ కి ఇవ్వడానికి రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థను భాగస్వామిగా తప్పనిసరిగా చేర్చుకోవాల్సి వచ్చిందని ఆ కంపెనీ డిప్యూటీ సీఈఓ చెప్పారని ఫ్రెంచ్‌ మీడియాలో వచ్చిన కథనాలను ఉదహరించారు.

కేవలం ఈ కాంట్రాక్టుకు 10 రోజుల ముందే అనిల్‌ అంబానీ, రిలయన్స్ డిఫెన్స్‌ సంస్థను ఏర్పాటు చేశారని వెల్లడించారు. కాంట్రాక్ట్‌ వారికే అప్పగించడం ద్వారా ప్రధాని మోదీ రిలయన్స్‌ జేబులో రూ.30 వేల కోట్లు వేశారని ఆరోపించారు. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదని, అంబానీలకే ప్రధాని అని ఎద్దేవా చేశారు. భారత ప్రభుత్వం ఏం చెప్పమంటే అదే చెప్పేలా దసాల్ట్‌ కంపెనీపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆరోపించారు. మీడియాపైన కూడా ఇదే రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. గతంలో ఫ్రెంచ్‌ పోర్టల్‌ మీడియా పార్ట్‌ లో వచ్చిన కథనాల ప్రకారం దసాల్ట్‌ కంపెనీ తప్పనిసరిగా రిలయన్స్‌ తో జోడీ కట్టాల్సి వచ్చిందని రాసిందని పేర్కొన్నారు. ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తున్నట్లు ఈ వ్యవహారంపై మోదీ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించటం లేదని ప్రశ్నించారు.

Next Story
Share it