Telugu Gateway
Andhra Pradesh

తెలంగాణలో పోటీచేయలేని పవన్..లక్నోలో రాజకీయాలు చేస్తారా?!

తెలంగాణలో పోటీచేయలేని పవన్..లక్నోలో రాజకీయాలు చేస్తారా?!
X

బిఎస్పీఅధినేత్రితో భేటీ వెనక ‘మాస్టర్ ప్లాన్’!

ఎవరికైనా ఇదే ప్రశ్న ఉదయించటం సహజం. ఎందుకంటే జనసేన పుట్టింది కూడా హైదరాబాద్ గడ్డపైనే. కానీ తెలంగాణలో పోటీపై ఎటూతేల్చుకోలేని జనసేనాని అకస్మాత్తుగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో రాజకీయాలు చేయగలరా?. ఆయనకు అంత సత్తా ఉందా?. ఇవే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్న ప్రశ్నలు. కానీ ఈ పరిణామాలను అంత తేలిగ్గా తీసిపారేయటానికి వీల్లేదు. ఎందుకంటే దీని వెనక భారీ ప్లానే ఉంది. పవన్ కళ్యాణ్ లక్నో పర్యటన వెనక ‘భారీ రాజకీయ ఎత్తుగడ’ ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బిఎస్పీకి వెనకబడిన వర్గాల పార్టీగా పేరుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న పవన్ కళ్యాణ్ ‘సోషల్ ఇంజనీరింగ్’లో భాగంగానే ఈ పర్యటన తలపెట్టారన్నది ఆ వర్గాల సమాచారం. అదేంటి అంటే..ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గంతోపాటు..శక్తివంతమైన ఎస్సీలను కలుపుకోవటం. ఇలా చేయటం ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కించుకోవటం అనేది పవన్ ఎత్తుగడ.

ఈ ఫార్ములా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో బాగా వర్కవుట్ అవుతుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకప్పుడు ఎస్సీలు అంతా కాంగ్రెస్ వైపు ఉండేవారు. ఏపీలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతినటంతో ఈ వర్గంలో ఎక్కువ మంది ప్రస్తుతం వైసీపీతో ఉన్నారు. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఎస్సీలు, కాపులను ఒక్కటి చేయగలిగితే తన రాజకీయ ప్లాన్ వర్కవుట్ అవుతుందనేది పవన్ ఎత్తుగడగా చెబుతున్నారు. ఇంత కాలం జాతీయ రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడని పవన్ సడన్ గా లక్నో పర్యటన తలపెట్టడం వెనక కారణం ఇదే అని చెబుతున్నారు. అందులో భాగంగానే బిఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు ఇతర నేతల సమావేశానికి సిద్ధమవటం.

సహజంగా ఎవరైనా పార్టీ పెట్టిన వెంటనే పోటీచేస్తారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది మాత్రం అందుకు బిన్నమైన శైలి. ఆయన పార్టీ పెట్టి ఆ తర్వాత టీడీపీ, బిజెపిలకు మద్దతుగా నిలిచారు. తర్వాత ‘తప్పు చేశాను’. టీడీపీకి మద్దతు ఇవ్వటం తప్పు అని తెలిసింది అంటూ ఇప్పుడు ఏపీలో పోటీకి రెడీ అవుతున్నారు. తాను మద్దతు ఇచ్చి ఉండకపోతే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచేదే కాదు అంటూ ఇప్పుడు చెబుతున్నారు ఇదంతా పాత కథే. తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కాకపోయినా..సినిమాల పరంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వస్తాయని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఆ ప్రచారం నిజం అయింది. తెలంగాణ సీఎం కెసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు బరిలోకి దూకారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో పోటీపై నాన్చుతున్న పవన్ కళ్యాణ్ సడన్ గా లక్నో పర్యటనకు వెళ్లటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. కొద్ది రోజుల క్రితం విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్తతో కలసి సింగపూర్ పర్యటనకు వెళ్లటం వెనక ఏమి ఉందా?అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Next Story
Share it