Top
Telugu Gateway

‘నోటా’ మూవీ రివ్యూ

‘నోటా’ మూవీ రివ్యూ
X

విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన ఓ టాలీవుడ్ సంచలనం. ఆయన ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతోంది. ‘మహానటి’లో తక్కువ నిడివి ఉన్న పాత్ర చేసినా..గీత గోవిందంలో ఓ అమ్మాయి ప్రేమ కోసం కష్టాలు పడే యువకుడిగా నటించినా విజయ్ కు మంచి మార్కులే పడ్డాయి. విడుదలకు ముందే విజయ్ తాజా చిత్రం ‘నోటా’ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఈ సినిమాను నిషేధించాలంటూ డిమాండ్లు..ఎన్నికల సంఘానికి కు ఫిర్యాదులు. అన్ని అడ్డంకులను అధిగమించుకుని సినిమా శుక్రవారం నాడు థియేటర్లలో సందడి ప్రారంభించింది. నోటా సినిమాతో విజయదేవరకొండ మరో సూపర్ హిట్ అందుకున్నాడనే చెప్పొచ్చు. ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా విజయ్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది.

వర్తమాన రాజకీయాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఫస్టాప్ సినిమా అంతా సరదగా సాగిపోతుంది. సెకండాఫ్ లో కొంచెం సినిమా స్లో అయినట్లు అన్పించినా ఓవరాల్ గా చూస్తే విజయ్ దేవరకొండకు మరో హిట్ దక్కినట్లే. సినిమా కథ విషయానికి వస్తే వరుణ్ (విజయ్ దేవరకొండ) అల్లరి చిల్లరిగా మందు కొడుతూ..అమ్మాయిలతో తిరుగుతుంటాడు. ఓ రాత్రి తన పుట్టిన రోజు పార్టీ చేసుకుని అమ్మాయిలతో కారులో వెళుతుండగా పోలీసులతో కూడిన వాహనాలు విజయ్ కారును అడ్డగిస్తాయి. విజయ్ తో ఉన్న స్నేహితుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా ఆపారనుకుని పోలీసులకు డబ్బులు ఇవ్వచూపుతాడు. కానీ ఓ పోలీసు ఉన్నతాధికారి విజయ్ తో అసలు విషయం చెబుతాడు. ఆ అసలు విషయం ఏమిటంటే తెల్లారితే మీరు సీఎం కాబోతున్నారని చెప్పటంతో విజయ్ కు మైండ్ బ్లాంక్ అయినంత పని అవుతుంది. ఓ స్కామ్ లో ఇరుక్కున్న విజయ్ తండ్రి నాజర్ తనపై విచారణ పూర్తయ్యే వరకూ తాత్కాలికంగా వరుణ్ ను సీఎం చేయాలని నిర్ణయించుకుంటారు.

ముందు అది తాత్కాలికమే అనుకుంటారు. కానీ రకరకాల ట్విస్ట్ లతో అది కాస్తా అలా ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే తండ్రీ..కొడుకుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కొడుకును సీఎం సీటు నుంచి దించాలని తండ్రే ప్లాన్ చేస్తాడు. కానీ విఫలమవుతాడు. ఈ సినిమాలో వర్తమాన రాజకీయాలకు సంబంధించి షెల్ కంపెనీల్లో రాజకీయ నేతల పెట్టుబడులు..స్వామిజీలు..రాజకీయ నేతల సంబంధాలు, రిసార్ట్ రాజకీయాలు, ఫ్లెక్సీ కల్చర్ ఇలా ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమా అంతా విజయ్ దేవరకొండ, నాజర్, సత్యరాజ్ ల చుట్టూనే తిరుగుతుంది. హీరోయిన్ మెహరీన్ కౌర్ ది అతిధి పాత్ర అనే చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడి కుమార్తెగా..విజయ్ క్లాస్ మెట్ గా నటించిన సంచనా నటరాజన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓవరాల్ గా చూస్తే విజయ్ ‘నోటా’కు ప్రేక్షకులు ఓటు వేస్తారనే చెప్పొచ్చు. అయితే సినిమా కథకు..టైటిల్ కు ఏ మాత్రం సంబంధం ఉండదు.

రేటింగ్. 3.5/5

Next Story
Share it