మన్నెం నాగేశ్వరరావుకూ ‘మరకలు’ ఉన్నాయ్!

సీబీఐలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐలో డైరక్టర్..అదనపు డైరక్టర్లు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుని సంస్థ ప్రతిష్టను మసకబార్చారు. ఈ తరుణంలో సర్కారు అర్థరాత్రి కొత్త ఇన్ ఛార్జి డైరక్టర్ గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది. అయితే ఆయనకూ అవినీతి మరకలు ఉన్నాయని..అలాంటి అవినీతిపరుడిని సీబీఐ డైరక్టర్ గా ఎలా నియమిస్తారంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. ఇది కేవలం రాకేష్ ఆస్థానాను కాపాడేందుకు ప్రధాని మోడీ తీసుకున్ని నిర్ణయం అని ఆయన ఆరోపించారు.
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్నెం నాగేశ్వరరావును విధుల నుంచి తొలగించాల్సిందిగా ఇటీవల వరకూ డైరక్టర్ గా ఉన్న అలోక్ వర్మ సూచించారని తెలిపారు. మన్నెం నాగేశ్వరరావు ఒడిషా, చత్తీస్‌గఢ్‌లో పనిచేసిన సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని ప్రశాంత్ భూషణ్ చెబుతూ..అందుకు ఆయన కొన్ని పత్రాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన్నెం నాగేశ్వరరావు నియమితులైన వెంటనే ఆయనపై కూడా అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో సీబీఐలో మరోసారి కలకలం మొదలైంది.