Telugu Gateway
Top Stories

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’తో భారత్ ప్రపంచ రికార్డు

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’తో భారత్ ప్రపంచ రికార్డు
X

భారత్ ఇప్పుడు ప్రపంచం ముందు తలెత్తుకుని నిలబడింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్దదైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటి’ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాం గుజరాత్ లో ఏర్పాటైంది. పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ని బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం పటేల్‌ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో ఉన్న సాధు బెట్‌లో ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ నిర్మించారు. 2013 అక్టోబర్‌ 31 న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహనిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు ఉంటుంది.

వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్‌ డ్యామ్‌ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు. ఇది రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైన పర్యాటక ప్రాంతంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. 30 పవిత్ర నదీ జలాలతో పటేల్‌ విగ్రహానికి అభిషేకం చేశారు. 37 మంది సర్దార్‌ పటేల్‌ కుటుంబ సభ్యులు ఈ విగ్రహ ఆవష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. పటేల్‌ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. కాగా, స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్‌ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు.

Next Story
Share it