Telugu Gateway
Telangana

వార్తలు చెప్పాల్సిన మీడియానే..వార్తలకు ‘కేంద్రాలా?’

వార్తలు చెప్పాల్సిన మీడియానే..వార్తలకు ‘కేంద్రాలా?’
X

ఒకప్పుడు వార్తలు తెలుసుకోవాలంటే ‘మీడియా’నే నమ్ముకునేవారు. అది పేపర్ కావొచ్చు..ఛానల్ కావొచ్చు. ఎందుకంటే అన్ని రకాల వార్తలు అక్కడ ఉంటాయి కాబట్టి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రజలకు వార్తలు అందించాల్సిన మీడియా సంస్థలే సంచలన ‘వార్తల’కు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సోషల్ మీడియానే. అంటే సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజం అని కాదు. అసలు వాస్తవంగా జరిగింది ఏంటి?. ప్రధాన మీడియాలో వచ్చింది ఏంటి?. ఆ విశ్లేషణ..చర్చ..విమర్శలు...తిట్లు అన్నీ సోషల్ మీడియాలో సాగిపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనపై అడ్డగోలుగా వార్తలు రాసిన ఓ శక్తివంతమైన మీడియాను ‘దూకుడు’ సినిమాలో ‘బ్రహ్మానందం’తో పోల్చారంటే పరిస్థితి ఊహించుకోచ్చు. తమకు నచ్చిన పెద్దలను సంతృప్తిపర్చటానికే ఇలా చేస్తున్నారని...మీడియాకు వెన్నెముక లేకుండా పోయిందంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఐటి దాడుల విషయంలో అదే జరిగింది. ఎవరో ఇఛ్చిన ఓ పుస్తకం పట్టుకుని..అందులో ఉన్నది నిజమా? అబద్ధమా అనే కనీస పరిశీలన లేకుండా కుమ్మేశారు. ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయిందంటూ ఎంపిక చేసిన సంస్థలు ఊధరగొట్టాయి.

కానీ ఐటి దాడులు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి అక్రమాలకు సంబంధించి అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. ఇప్పుడు ఎన్నికల సీజన్ కాబట్టి ఈ సారి నేతల కంటే మీడియానే వార్తల్లో ప్రముఖంగా నిలవటం ఖాయంగా కన్పిస్తోంది. గత కొంత కాలంగా అటు ఏపీలో అయినా..ఇటు తెలంగాణలో ప్రభుత్వాల్లో జరుగుతున్న అవకతవకలు..అక్రమాలు వెలికితీయటాన్ని ప్రధాన మీడియా ఎప్పుడో వదిలేసింది. అవి ఏమైనా వస్తున్నాయి అంటూ అది కాస్తా వెబ్ మీడియా, సోషల్ మీడియా కేంద్రంగానే. రేవంత్ రెడ్డి పై ఐటి దాడుల విషయంలో మీడియా తీవ్ర విమర్శల పాలు అయింది. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ తోపాటు పలు ఇతర పార్టీలు కూడా తమ వాదనకు మీడియా చోటు కల్పించటం లేదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. అందుకే చాలా మంది సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు.

Next Story
Share it