Telugu Gateway
Politics

సీబీఐకి కొత్త ఇన్ ఛార్జి డైరక్టర్

సీబీఐకి కొత్త ఇన్ ఛార్జి డైరక్టర్
X

దేశ అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐ పరువు అట్టడగుస్థాయికి జారిపోయింది. గతంలోనూ సీబీఐపై ఎన్నో విమర్శలు వచ్చినా కూడా ఏకంగా డైరక్టర్..స్పెషల్ డైరక్టర్ స్థాయి అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవటం..కేసులు పెట్టుకోవటంతో ఈ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ బాస్ ల నిర్ణయానికి అనుగుణంగా సీబీఐ ముందుకు సాగుతుందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అవినీతి మరక లేకుండా పాలన సాగిస్తున్న చెప్పుకుంటున్న మోడీ సర్కారు హయాంలో దేశ అత్యున్నత సంస్థ ప్రతిష్ట మరింత మసకబారిందనేది వాస్తవం. అయితే ప్రధాని మోడీ ఇది మరింత దిగజారకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలుకు శ్రీకారం చుట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తప్పిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి మన్యం నాగేశ్వరరావును నియమించారు.

ఈ మేరకు కేంద్ర అధికారుల పరిపాలన వ్యవహారాలు చూసే డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. సీబీఐ డైరక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానాలను సెలవుపై పంపారు. అయితే ఇన్ ఛార్జి డైరక్టర్ గా నియమితులైన నాగేశ్వరరావు స్వస్థలం వరంగల్‌ జిల్లాలోని బోరె నర్సాపూర్‌. ప్రస్తుతం సీబీఐలో జాయింట్‌డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ఒడిషా కేడర్‌లో డీజీపీగా పనిచేశారు. కేసుల నుంచి బయటపడేందుకు అస్థానాకు తాను రూ. 3 కోట్ల లంచం ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సానా సతీశ్‌ చెప్పడంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేయగా, సతీశ్‌ వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై దేవేంద్ర అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Next Story
Share it