Telugu Gateway
Telangana

నిరుద్యోగ భృతిపై కెసీఆర్ దో మాట..కెటీఆర్ దో మాట!

నిరుద్యోగ భృతిపై కెసీఆర్ దో మాట..కెటీఆర్ దో మాట!
X

‘నిరుద్యోగ భృతా. ఎట్లిస్తరు? ఎంతమందికి ఇస్తరు. అసలు ఇది సాధ్యం అవుతదా?. ఏది పడితే అది చెప్పటమేనా?. ఓ లెక్క ఉండొద్దా? ’ అంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ కొద్ది రోజుల క్రితమే మీడియా సాక్షిగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు కేవలం తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఇదంతా పాత కథ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సాక్ష్యాత్తూ కెసీఆర్ తనయుడు,మంత్రి కెటీఆర్ ఇప్పుడు ఏకంగా నిరుద్యోగ భృతి అంశం కెసీఆర్ పరిశీలనలో ఉందని మీడియాకు వెల్లడించారు. మరి ఇంత బహిరంగంగా నిరుద్యోగ భృతి ఇవ్వటం సాధ్యం కాదని కెసీఆర్ చెపితే..ఇప్పుడు కెటీఆర్ సీఎం కెసీఆర్ పరిశీలిస్తున్నారని చెప్పటం వెనక మతలబు ఏమిటి?. కాంగ్రెస్ హామీని యువత నమ్ముతారని భావించే టీఆర్ఎస్ ప్లేటు ఫిరాయించిందా?.

కెటీఆర్ ప్రకటనను చూస్తే ఖచ్చితంగా ఇదే అనుమానం రాక తప్పదు. తెలంగాణ రాష్ట్రం వస్తే యువతకు లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని నమ్మించారు. కానీ వేల సంఖ్యలోనే ఈ భర్తీ జరిగింది. ఇది ఒకెత్తు అయితే వేసిన నోటిఫికేషన్లలో చాలా వరకూ తప్పులతడకగా ఉండటం..కోర్టు కేసులు ఇలా రకరకాల కారణాలతో ఉద్యోగాల భర్తీ ఏ మాత్రం ముందుకు సాగలేదు. దీంతో తెలంగాణలో యువత సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. హైదరాబాద్ లోని ఒక్క ఉస్మానియా యూనివర్శిటీలోనే కాదు...తెలంగాణ రాష్ట్రంలో యువత టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ విషయాన్ని గుర్తించే ఇప్పుడు ‘నిరుద్యోగ భృతి’ పరిశీలన అంటూ కొత్త రాగం మొదలుపెట్టారు.

Next Story
Share it