Telugu Gateway
Telangana

కెసీఆర్ సర్కారు మీద కేసులేయకూడదా?!.

కెసీఆర్ సర్కారు మీద కేసులేయకూడదా?!.
X

కేసుల కారణంగా ఆగిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా?

ప్రభుత్వం మీద కేసులేస్తే అసెంబ్లీని రద్దు చేస్తారా?. కేసులు వేయటం..పౌరులు..పార్టీల హక్కు కదా?. కేసుల్లో మెరిట్ ఉంటే ఆయా కోర్టులు పట్టించుకుంటాయి? లేదంటే కేసులు వేసిన వారికే చివాట్లు పెట్టడంతోపాటు...జరిమానాలు కూడా విధిస్తాయి. నిజంగా ఓ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని భావించిన వారు ఎక్కడికి వెళ్ళాలి?. న్యాయస్థానం తప్ప..వాళ్ళకు వేరే దిక్కు ఎక్కడ ఉంది?. ముఖ్యమంత్రి కెసీఆర్ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రోజూ సామాన్య ప్రజలను కలిసింది లేదు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తే..కేసులు వేస్తే పరిపాలన ఆగిపోతుందా?. ప్రభుత్వ తరపు లాయర్లు సర్కారుపై వేసిన కేసుల్లో హేతుబద్దత లేదని..అవన్నీ తప్పుడు కేసులు అని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అంతే కానీ..ప్రతిపక్షాలు కేసులు వేశాయని..అవినీతి ఆరోపణలు చేశాయని తొమ్మిది నెలల ముందు అసెంబ్లీని రద్దు చేస్తారా?. కేసులు వేసిన కారణంగా ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ ఆగిందా?. మిషన్ భగీరధ ఆగిందా?. మిషన్ కాకతీయ ఆగిందా?. తెలంగాణ ప్రభుత్వం తన ఫ్లాగ్ షిప్ కార్యక్రమంగా చెప్పుకుంటున్న ఏ ఒక్క కార్యక్రమం కూడా కోర్టు కేసులతో ఆగింది లేదు. పోనీ ముఖ్యమంత్రి కెసీఆర్ ఏమైనా ప్రతిపక్షాల మాటలను కనీసం పట్టించుకుంటారా? అంటే అదీ లేదు. ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాల బదులు కొత్త భవనాల నిర్మాణాలను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, టీడీపీ, బిజెపితో పాటు సభలో ప్రాతినిధ్యం లేని వారు చాలా మంది వ్యతిరేకించారు. ఇందుకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు..మాకు నచ్చినట్లు చేస్తాం.

మీరు చెపితే మేం నిర్ణయం మార్చుకోవాలా? మా నిర్ణయం తప్పు అయితే ప్రజలే ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని చెబుతారు అని కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా ఎన్నికైన ప్రభుత్వాలు తమ నిర్ణయాలకు అనుగుణంగాన ముందుకెళతాయి. అందులో సందేహం లేదు. అయితే అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి తాము తీసుకున్న నిర్ణయాలను కనీసం వివరించే ప్రయత్నం చేస్తాయి. కానీ అందుకు భిన్నంగా కెసీఆర్..మా నిర్ణయం..మా ఇష్టం అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇప్పుడు కోర్టులో మాత్రం పాలనకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పటం విడ్డూరం. కెసీఆర్ ఎక్కువ జాతకాలను నమ్ముతారు. వాస్తుకు అనుగుణంగా లేదనే ఏకంగా సచివాలయానికే రావటం మానేశారు. ఇఫ్పుడు కూడా 2018లో ఎన్నికలు పూర్తయితేనే తిరిగి అధికారంలోకి వస్తారని జ్యోతిష్యులు చెప్పటంతోనే అసెంబ్లీని రద్దు చేశారనే ప్రచారం బలంగా ఉంది. కానీ ఆ విషయం చెపితే చెల్లుబాటు కాదు కాబట్టి..కేసుల విషయాన్ని తెరపైకి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ ప్రతిపక్షాలు..బాధితులు కేసులు వేయరా?. ఎన్నికల ఫలితాలకు నష్టపోయే ప్రజలకు ఏంటి సంబంధం?.

Next Story
Share it