Telugu Gateway
Cinema

కన్నీరు పెట్టించిన ఎన్టీఆర్

కన్నీరు పెట్టించిన  ఎన్టీఆర్
X

సహజంగా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే హంగామా..హడావుడి. కోలాహాలం. అందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకింత భారంగా నడిచింది. గత సినిమా ఫంక్షన్లను.. ఈ సినిమాకు ఓ పెద్ద తేడా ఉంది. అది ఏంటి అంటే వేదికపై హరికృష్ణ లేకపోవటం. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రతి సినిమా వేడుకల్లో హరికృష్ణ విధిగా పాల్గొంటారు. ఇటీవలే ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే గుండె నిబ్బరంతో షూటింగ్ లో పాల్గొని..అందరి ప్రశంసలు అందుకున్నాడు జూనియర్. మంగళవారం రాత్రి హెచ్ఐసిసీలో జరిగినన ఈ సినిమా ఫంక్షన్ కు వచ్చే సమయం నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు గంభీరవదనాలతో ఎరుపెక్కిన కళ్ళతో కన్పించారు. ఓ వైపు కొంత మంది అభిమానుల కేకలు...మరో వైపు విషణ్ణవదనాలతో హీరో ఫ్యామిలీ. ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలా జరగటం బహుశా ఇదే మొదటిసారేమో. ఎన్టీఆర్, పూజా హెగ్డె, రెషా హెబ్బా లు నటించిన ఈ సినిమా అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ...‘‘త్రివిక్రమ్‌తో సినిమా చేయాలన్నది నా 12 ఏళ్ల కల. ఆయన ‘నువ్వే నువ్వే’ సినిమా తీయక ముందు నుంచి కష్టసుఖాలు మాట్లాడుకునేంత దగ్గర మిత్రుడు. ఎందుకు మా ఇద్దరికీ సినిమా కుదరట్లేదు అని చాలాసార్లు అనుకున్నా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘బహుశా నా జీవితంలో నెలరోజుల కిందట జరిగిన సంఘటన (తండ్రి హరికృష్ణ మృతి) ఈ చిత్రంతో ముడిపడి ఉందేమో. ఆయనతో (త్రివిక్రమ్‌) సినిమా మొదలు పెట్టిన తర్వాతే.. నెలరోజుల కిందట జరిగిన సంఘటన తర్వాతే.. బహుశా నాకు జీవితం విలువ అర్థం అయింది. ఈ సినిమా తాత్పర్యం ఒక్కటే. ‘వాడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు.. కానీ యుద్ధం ఆపేవాడే మగాడు.. వాడే మొనగాడు..’. జీవితమంటే కొట్టుకోవడం.. తిట్టుకోవడం కాదు.. బతకడం. ఎలా బతకాలో చెప్పే చిత్రం ‘అరవిందసమేత వీరరాఘవ’.

మనిషిగా పుట్టినందుకు ఎంత హుందాగా, ఎంత ఆనందంగా, అస్సలు మనిషిగా ఎలా బతకాలో చెప్పే చిత్రమిది. ఒక మగాడి పక్కన ఆడదానికంటే బలం ఇంకోటి ఏదీ ఉండదు. ఒక గొప్ప చిత్రాన్ని నాకు ఇవ్వడానికే.. జీవితం విలువ తెలుసుకోవడానికే.. నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి ఇప్పుడు ఆయనతో (త్రివిక్రమ్‌) ఈ సినిమా చేయించాడేమో. చాలా థ్యాంక్స్‌ స్వామీ. 12 ఏళ్ల ప్రయాణంలో ఓ స్నేహితుణ్ణి, ఓ దర్శకుణ్ణి చూశా.. ఈ సినిమా ముగిసేలోపు ఓ ఆత్మబంధువుని చూశా. రేపు నాకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా మీ అందరితో పాటు నాతో నిలబడే వాడే మా త్రివిక్రమ్‌. ఈ చిత్రం తప్పకుండా నా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది నా 28వ చిత్రం. 27 చిత్రాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే పాత్రలు ఏ దర్శకుడూ నాకు పెట్టలేదు. కానీ, ఈ చిత్రంలో అది యాధృచ్చికమో, అలా జరిగిందో తెలీదు.. మనం అనుకునేది ఒకటి.. పైనవాడు రాసేది ఇంకోటి. ఈ నెలరోజులు నాకు అన్నలాగా, తండ్రిలాగా, మిత్రుడిలాగా తోడుగా ఉన్నాడీయన. థ్యాంక్స్‌ స్వామీ (త్రివిక్రమ్‌). కొన్ని బంధాలు కలిసినప్పుడు వాళ్ల ప్రయత్నం సక్సెస్‌ అయితే ఆ బంధం ఇంకా గట్టిపడిపోతుందని అంటారు. ఈ బంధాన్ని మా నాన్నగారు (హరికృష్ణ) చూస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించేలా చేసి, మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తారని నమ్ముతున్నా.

ఈ సినిమాకి తమన్‌ ప్రాణం పెట్టాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ అయినప్పుడు.. చాలామంది ‘ఎన్టీఆర్‌ మాస్‌ హీరో కదా.. డ్యాన్సులుండే పాటలు లేవేంటి?’ అని అడిగారు. నటనలో భాగం డ్యాన్స్‌ మాత్రమే తప్ప.. డ్యాన్స్‌ లో భాగం నటన కాదు.. అలాంటి ఓ నటుడి కోసం త్రివిక్రమ్‌ రాసిన ఓ చిత్రానికి పూర్తిగా తమన్‌ తప్ప వేరే ఇంకెవరూ న్యాయం చేయలేరు. థ్యాంక్స్‌ తమన్‌. ఈ సినిమాలో ప్రతి పాట ఓ సందేశాన్ని ఇస్తుంది. అలాంటి గొప్ప పాటలు రాసిన మా గురువుగారు సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రిగార్లకు ధన్యవాదాలు. నాకు–త్రివిక్రమ్‌కి మధ్యలో ఫ్రెండ్‌షిప్‌కి ఓ పిల్లర్‌ ఉంది.. మా రాధాకృష్ణగారు. ఓ సినిమా గురించి నిర్మాత ఎంత తాపత్రయ పడతాడో నేనెప్పుడో విన్నా. చాలా సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా చూశా. సినిమా ఎలా తీయాలి. ఎంత బాగా రావాలి? అని అనలైజ్‌ చేసే తక్కువమందిలో రాధాకృష్ణగారు ఒక్కరు.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it