Telugu Gateway
Telangana

శంషాబాద్ లో ‘కొత్త అంతర్జాతీయ టెర్మినల్’

శంషాబాద్ లో ‘కొత్త అంతర్జాతీయ టెర్మినల్’
X

శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే విస్తరణ పనులు ప్రారంభించిన జీఎంఆర్ రద్దీని తట్టుకునేందుకు అంతర్జాతీయ ప్రయాణికుల కోసం తాత్కాలిక టెర్మినల్ ను సిద్ధం చేసింది. ఈ టెర్మినల్ ను బుధవారం నాడే ప్రారంభించారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం తన సామర్ధ్యానికి మించి ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. దీంతో నిత్యం ఉదయం వేళల్లో సెక్యూరిటీ చెక్ దగ్గర ప్రయాణికులు ఎక్కువ సమయం వేచిచూడాల్సి వస్తోంది. చాలాసార్లు ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణం బస్టాండ్లు..రైల్వే స్టేషన్ ప్రయాణాన్ని తలపిస్తోందని ఫిర్యాదులు కూడా చేశారు. ఎన్ని అదనపు సెక్యూరిటీ చెక్ కేంద్రాలు ఏర్పాటు చేసినా పెరిగిన ప్రయాణికుల అవసరాలకు అవి ఏ మాత్రం సరిపోవటం లేదు. దీంతో విమానాశ్రయ నిర్వాహకులు అంతర్జాతీయ ప్రయాణికుల కోసం తాత్కాలిక టెర్మినల్ ను రెడీ చేశారు.

దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఉపయోగిస్తున్న టెర్మినల్ సౌకర్యాలను దేశీయ ప్రయాణికులకు వాడే అవకాశం ఏర్పడనుంది. దీని వల్ల కొంత అయినా ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. విస్తరణ పనులు పూర్తయ్యే వరకూ ఈ తాత్కాలిక సౌకర్యాన్ని ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రారంభించిన విస్తరణ పనులు ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ముందే ప్రణాళికలు సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it