Telugu Gateway
Andhra Pradesh

మా అక్రమ సంపాదన అడగొద్దు..అవినీతి సొమ్ముముట్టుకోవద్దు!

మా అక్రమ సంపాదన అడగొద్దు..అవినీతి సొమ్ముముట్టుకోవద్దు!
X

ఇదేనా దేశంలో సీనియర్ మోస్ట్ రాజకీయ నేతగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకునే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయడు దేశానికి ఇస్తున్న సందేశం. ఏపీలో జరుగుతున్న ఐటి దాడులు రాజకీయ ప్రేరేపితమా? కాదా అనే విషయం పక్కన పెడదాం. టీడీపీ రాజకీయ ప్రేరేపితం అంటుంది..బిజెపి కాదంటుంది. ఆ లెక్క తేలదు. ఎంపిక చేసిన కంపెనీలపై ఐటి దాడులు చేస్తే ఏపీ మొత్తంపై దాడి చేసినట్లా?. ఏకంగా ప్రభుత్వమే వణికిపోయి ఐటి అధికారులకు పోలీసు భద్రత ఉపసంహరించుకుంటాం..సుప్రీంకోర్టులో పోరాడతాం అంటూ ఎందుకింత బెంబేలు ఎత్తిపోతున్నారు. అసలు ఓ ప్రభుత్వం చేయాల్సిన పనేనా ఇది?. 25 కాదు..50 కంపెనీలపై ఐటి దాడులు చేశారనే అనుకుందాం. లెక్కలు సరిగ్గా ఉంటే ఐటి అధికారులు ఏమి చేయగలరు?. తేడా ఉంటేనే అసలు సమస్య. మహా అయితే ఆయా సంస్థలకు పెనాల్టీలు వేస్తారు.

మరీ లెక్కల్లో వందల కోట్ల రూపాయల తేడాలు ఉంటే ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో మూలం చెప్పాల్సిందే. అందులో ఎవరికీ మినహాయింపులు ఉండవు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తాను ప్రధాని నరేంద్రమోడీపై పోరాటం చేస్తున్నానని తనకు తాను చెప్పుకుంటున్నారు కనుక కేంద్ర సంస్థలు ఏమీ ఏపీలో ఐటి దాడులు చేయకూడదా?. అక్రమ సంపాదన ఉంటే పట్టుకోకూడదా?. అవినీతిపరుల గుట్టురట్టు చేయకూడదా?. ఇంత సీనియర్ రాజకీయ నేత అయిన చంద్రబాబు ఎందుకు ఐటి దాడులకే వణికిపోతున్నారు. ప్రధాని మోడీ ఇంకా ఎక్కువ ఫోకస్ పెడితే పరిస్థితి ఏంటి?.

ఎంపిక చేసిన సంస్థలపై ఐటి దాడులు చేస్తే ఏపీపై దాడిచేసినట్లే అనే చంద్రబాబు వాదన చెల్లుబాటు అవుతుందా?. సామాన్యులు మొదలుకుని..చదువుకున్న వారు ఎవరైనా ఆయన మాటలను విశ్వసిస్తారా?. అందులో హేతుబద్దత ఏంత?. ఐటి దాడుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు చూసి అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాలో స్పందించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల భయంతో తాము అక్రమంగా ‘పార్క్’ చేసిన సొమ్ముకు ఎసరు ఎక్కడ వస్తుందోనన్న భయం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అందుకే అంత టెన్షన్ పడుతున్నారని టాక్.

Next Story
Share it