Telugu Gateway
Politics

మహాకూటమికి హరీష్ రావు ప్రశ్నలు

మహాకూటమికి హరీష్ రావు ప్రశ్నలు
X

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎప్పటికీ ఆంధ్రాబాబే అని టీఆర్ఎస్ నేత, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మహాకూటమికి సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకునే పొత్తు షరుతులతో కూడినదా లేక శరం లేని పొత్తా? అని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తమ పార్టీ కూడా గతంలో కాంగ్రెస్‌, టీడీపీలతో పొత్తుపెట్టుకుందని, కానీ అవి షరతులతో పెట్టుకున్నవని స్పష్టం చేశారు. 2009లో తెలంగాణకు మద్దతు ప్రకటించడంతోనే టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందన్నారు. 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని ఏఐసీసీతో ప్రకటన చేయించామని గుర్తు చేశారు.

ఆ షరతులు ఉల్లంఘించినప్పుడు ఆ పార్టీలతో తెగదెంపులు చేసుకున్నామన్నారు. అదే స్పష్టతను మహాకూటమితో సాధించగలరా? అని ప్రశ్నించారు. మహాకూటమి పొత్తు స్వప్రయోజనమో.. రాష్ట్ర ప్రయోజనమో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసలు మహాకూటమి లక్ష్యం ఏంటో చెప్పాలన్నారు. అడుగడుగున తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్యాయంగా తీసుకున్న ఏడు మండలాలను తిరిగి తెలంగాణను కలుపతామనే ప్రకటన చేయించగలరా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. లేకపోతే పోలవరం డిజైన్‌ మార్పు చేయించేలా ఏమైన కండిషన్‌ పెట్టారా అని అడిగారు.

Next Story
Share it