Telugu Gateway
Andhra Pradesh

అచ్చెన్నాయుడు..కళా వెంకట్రావు ఫెయిల్యూర్..లోకేష్ హిట్టా?!

అచ్చెన్నాయుడు..కళా వెంకట్రావు ఫెయిల్యూర్..లోకేష్ హిట్టా?!
X

అచ్చెన్నాయుడు. కళా వెంకట్రావు. సీనియర్ రాజకీయ నాయకులు. సీనియర్ మంత్రులు. వీళ్ళ అనుభవం ముందు నారా లోకేష్ అనుభవం ఏ పాటి?. కళా వెంకట్రావు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా. పైగా కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రులు. కానీ తిత్లీ తుఫాన్ సహాయ చర్యల్లో జిల్లాకు చెందిన మంత్రులు ఇద్దరూ ఫెయిల్ అయ్యారా?. సహాయ చర్యలు అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లే స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షించారా?. వీళ్లు మాత్రమే సహాయక చర్యలు చేపట్టగలరా?. సీనియర్ మంత్రులు అయినా సహాయ చర్యలు చేపట్టలేకపోయారా?. తిత్లీ తుఫాన్ తర్వాత లోకేష్ అక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తే తప్ప...అధికారులు పనిచేయలేదా?. చేయలేకపోయారా?. అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో ముందు ఉంటారు?. కళా వెంకట్రావు వాయిస్ కాస్త వీక్. తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. తుఫాన్ తర్వాత చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు.

సాక్ష్యాత్తూ కళా వెంకట్రావే విద్యుత్ శాఖ మంత్రి కూడా. మీడియా మొత్తం తిత్లీ తుఫాన్ పునరావాస పనులు అసలు చంద్రబాబు, నారా లోకేష్ లేకుంటే జరిగేవే కావు అనే కలరింగ్ ఇచ్చారు. అంటే సొంత పార్టీ మంత్రులను డమ్మీలను చేసి..చంద్రబాబు, నారా లోకేష్ లే ప్రచారం పొందారు. కొన్ని సందర్భాల్లో మంత్రులు వీరి పక్కన ఉన్నా..అది కూడా ఏదో ఫోటో ఫోజు తప్ప...పెద్దగా జిల్లా మంత్రులకు యాక్టివ్ రోల్ ఉన్నట్లు ఎక్కడా కన్పించదు. ఏ టీవీ చూసినా..ఏ పేపర్ చూసినా కేవలం ఇద్దరే..ఇద్దరు. వాళ్లు ఒకరు చంద్రబాబు..మరొకరు నారా లోకేష్. అంటే సొంత మంత్రులనే డమ్మీలు చేసి..తాము తప్ప...ఎవరూ పనిచేయరని ప్రచారం చేసుకోవటంలో చంద్రబాబు, నారా లోకేష్ లు సొంత మంత్రులను కూడా అవమానిస్తున్నారని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి విషయంలోనూ మంత్రి కొల్లు రవీంద్రను పక్కన పెట్టి హంగామా అంతా నారా లోకేషే చేసిన విషయం తెలిసిందే. యాడ్స్ లోనూ ఆయన ఫోటోనే ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం తుఫాన్ విషయంలోనూ అదే చేశారు. దీనిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏపీలో ఏమి చేసినా చంద్రబాబు..లోకేషే చేయాలి. మిగిలిన మంత్రులు అంతా డమ్మీలు అని చెప్పటం వారిద్దరి ఉద్దేశం అని స్పష్టం అవుతోందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it