Telugu Gateway
Movie reviews

‘అరవింద సమేత’ మూవీ రివ్యూ

‘అరవింద సమేత’ మూవీ రివ్యూ
X

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్స్ కు ‘అజ్ణాతవాసి’ బ్రేక్ వేసింది. ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో ఎక్కడా బ్రేకుల్లేకుండా దూసుకెళుతున్నాడు. మరి వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. మరి గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా?. ఓ సారి చూద్దాం. ‘బిడ్డకు పాలిచ్చి పెంచేతల్లికి పాలించటం రాదా?. యుద్ధం చేసే శక్తి లేని వాడికి శాంతి కోరుకునే హక్కు లేదు.’ ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్ లతో రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి మ్యాజిక్ చేశాడు. రాయలసీమలోని ఓ రెండు గ్రామాల మధ్య గ్రూప్ మధ్య తగాదాలే ఈ సినిమా కథకు మూలం. అది కూడా పేకాట దగ్గర పడిన ఐదు రూపాయల అప్పు కోసం గొడవ మొదలవుతుంది. ఈ గొడవతో ఇరు గ్రామాల వారు నరుక్కుని చంపుకునే పరిస్థితి వరకూ వెళుతుంది. ఈ ఫ్యాక్షన్ గొడవల్లో ఓ గ్రూపునకు జగపతిబాబు, మరో గ్రూపునకు రాఘవ (ఎన్టీఆర్) తండ్రి నాగబాబు నాయకత్వం వహిస్తారు. లండన్ నుంచి గ్రామానికి రాఘవ తిరిగొస్తున్న సమయంలోనే జరిగిన గొడవలో రాఘవ తండ్రి హత్యకు గురవుతాడు.

ఆ సమయంలో కత్తి పట్టి శత్రులను సంహరించిన రాఘవ తర్వాత ‘శాంతి’ మంత్రం జపిస్తాడు. సహజంగా ఫ్యాక్షనిస్టులు ఎంత సేపు పగతీర్చుకోవటానికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకు భిన్నంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోతో శాంతి జపం చేయించుతాడు. ఆ సమయంలో వచ్చే డైలాగులు అర్థవంతంగా..ఆలోచనలు రేకెత్తించేవిగా ఉంటాయి. ఫ్యాక్షనిస్టు కుటుంబంలో పుట్టి శాంతి కోరుకునే యువకుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలోనూ తన నట విశ్వరూపం చూపించాడు. సినిమా అంతా సీరియస్ నెస్ తో..గంభీరమైన డైలాగులతో ఆకట్టుకుంటాడు. సహజంగా రాయలసీమ ఫ్యాక్షనిజంలో మహిళల పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో మహిళల పాత్ర గురించి సినిమాలో కొత్త చర్చను లేవనెత్తాడు. హీరోయిన్ అరవింద(పూజా హెగ్డె) తండ్రి నరేష్ పేరుమోసిన లాయర్. ఆమె ఆంత్రోపాలజీ చదువుతూ ఫ్యాక్షన్ మీద ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ వాళ్ల ఇంట్లోకి ప్రవేశిస్తాడు. క్లైయింట్లతో అన్ని పనులు చేయించుకునే అలవాటు ఉన్న నరేష్ ఎన్టీఆర్ ను కూడా అలాగే వాడేసుకుంటాడు. చివరకు అదే వాళ్ల ఫ్యామిలీకి చిక్కులు తెచ్చిపెడుతుంది. అరవింద సమేత వీరరాఘవ సినిమా అంతా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోలాగే నడిచిపోతుంది. ఎమోషన్స్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. అంతేకాదు రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెప్పేందుకు ఎన్టీఆర్‌ చూపించిన డెడికేషన్‌ స్క్రీన్‌ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది. లుక్స్‌ పరంగానూ ఎన్టీఆర్‌ పడిన కష్టం సినిమాకు ప్లస్‌ అయ్యింది. హీరోయిన్‌గా పూజా హెగ్డె ఆకట్టుకుంది. విలన్‌ పాత్రలో జగపతి బాబు కొత్త లుక్ తో రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా జీవించాడు. లుక్స్‌ పరంగానూ భయపెట్టాడు. యంగ్ హీరో నవీన చంద్ర తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్‌గా టర్న్‌ అయిన సునీల్ తనదైన టైమింగ్‌తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. రావూ రమేష్‌, దేవయాని, సుప్రియా పాతక్‌, ఈషా రెబ్బా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

త్రివిక్రమ్‌ గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్‌టైన్మెంట్‌ కూడా తక్కువే. తమన్‌ సంగీతం సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. పాటలతో రిలీజ్‌కు ముందే ఆకట్టుకున్న తమన్‌.. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్‌నే మార్చేశాడు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ లో తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌. లాయర్ నరేష్ దగ్గరకు వచ్చే ఓ రౌడీ గ్యాంగ్ ‘ఆకు తింటారా?. పోక తింటారా?’ అంటూ చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. అరవింద సమేత వీరరాఘవ త్రివిక్రమ్ శ్రీనివాస్ గత చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా. ఓవరాల్ గా చూస్తే అరవింద సమేత యాక్షన్ ఎక్కువ..ఎంటర్ టైన్ మెంట్ తక్కువ. సినిమాలో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

రేటింగ్. 2.75/5

Next Story
Share it