Telugu Gateway
Andhra Pradesh

ఐటి శాఖకు ఏపీ అవినీతి ఐఏఎస్ ల చిట్టా!

ఐటి శాఖకు ఏపీ అవినీతి ఐఏఎస్ ల చిట్టా!
X

ఈ నెలలోనే నోటీసులు..ఆపై దాడులు?!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన పనులన్నీ అడ్డగోలుగా చేస్తూ అక్రమార్జన చేసిన ఐఏఎస్ అధికారులు ఎవరు?. వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత అక్రమ సంపాదన కూడబెట్టారు. వాళ్ళ బినామీలు ఎవరు?. బినామీల పేరుతో కొనుగోలు చూసిన భూములెన్ని? పదుల సంఖ్యలో ఇళ్ళు దక్కించుకున్నది ఎవరు?. ఈ జాబితా అంతా ఇప్పటికే ఐటి శాఖకు చేరిపోయింది. ఇది ఇచ్చింది కూడా ప్రభుత్వంలోని ఓ కీలక అధికారే కావటం విశేషం. పక్కా ఆధారాలతో సహా ఈ వివరాలు అందించటంతో..ఇక ఐటి శాఖ రంగంలోకి దిగటమే ఆలశ్యం. ఈ జాబితాలో ‘ముఖ్య’ కార్యాలయంలో ఉన్న ‘ఇద్దరు’ సీనియర్ ఐఏఎస్ ల పేర్లు కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏపీలో ఐటి శాఖ దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ సంస్థలపై ఐటి శాఖ దాడులు చేస్తుంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ్ కో గజగజ లాడుతోంది. ఇదేదో ఏపీపై దాడిగా చిత్రీకరిస్తోంది.

ఇప్పుడు ఏకంగా ఐఏఎస్ లపై ఐటి శాఖ దాడులు చేస్తే మీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు మరింత రెచ్చిపోయే అవకాశం ఉండటంతో తమ దగ్గర ఉన్న ఆధారాలతో ముందు నోటీసులు జారీ చేసి..వివరణ ఇవ్వాలని అడగటం..తర్వాత దాడులకు దిగేందుకు వీలుగా ఐటి శాఖ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతా పక్కాగా స్కెచ్ వేసుకున్న తర్వాతే ఐటి శాఖ రంగంలోకి దిగింది..అక్రమ సంపాదన ఎవరెవరి ఖాతాల్లోకి..ఎలా వెళుతుంది..అది ఎక్కడ నుంచి ఎక్కడికిపోతున్నది వంటి వివరాలు ముందస్తుగానే పూర్తిగా సేకరించిన ఓ ‘చార్ట్’ కూడా సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అస్మదీయ అధికారులుగా పేరుగాంచిన వారందరూ ఇప్పుడు చిక్కుల్లో పడటం ఖాయంగా కన్పిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it