Telugu Gateway
Cinema

‘విజయ్’ ఎక్కడుంటే వివాదాలు అక్కడే!

‘విజయ్’ ఎక్కడుంటే వివాదాలు అక్కడే!
X

విజయ దేవరకొండ. టాలీవుడ్ లో ఇప్పుడు ఓ సెన్సేషనల్ హీరో. ‘అర్జున్ రెడ్డి’ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో..అంతే వివాదం కూడా రేకెత్తించింది. అయితే ఇవేమీ తన పనితీరుపై ప్రభావం చూపించవు అనే రీతిలో విజయ దేవరకొండ ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆయన తాజా సినిమా ‘గీత గోవిందం’ సినిమా కూడా అర్జున్ రెడ్డి తరహాలోనే అదరగొట్టే హిట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఓ పాటపై కూడా పెద్ద దుమారం రేగింది. అయితే విజయ్ ఈ విషయంలో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి..సినిమాపై ఆ ప్రభావం పడకుండా చూసుకున్నారు. త్వరలో విజయ్ హీరోగా నటించిన సినిమా ‘నోటా’ విడుదలకు సిద్ధం కానుంది. అందులో కూడా వివాదస్పద డైలాగులు ఉన్నాయి. ఈ రోజు మంచి రోజు కాదు అని మా పంతులు గారు చెప్పారు అని ఓ నేత అంటే..రాష్ట్ర భవిష్యత్ ఓ పంతులు చేతిలో ఉందా? అంటూ విజయ్ వ్యాఖ్యానిస్తారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌పై కూడా వివాదం నడుస్తోంది.

ఎన్నికల్లో తనకు నచ్చిన అభ్యర్ధి ఎవరూ లేకపోతే ‘నోటా’కు ఓటేయవచ్చు. అయితే ఈ టైటిల్ చూస్తే నోటాకు ఓటెయ్యమని ప్రేరేపించేలా ఉందని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ పొలిటికల్‌ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 4న సినిమాను రిలీజ్‌ కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్‌ వెన్నలకంటి పోలీసులను ఆశ్రయించాడు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజాపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి.

Next Story
Share it