లోకేష్ సిఫారసుతో వేమూరి రవికి పోస్టు..రవి సిఫారసుతో ఐటి రాయితీలు
నారా లోకేష్ సిఫారసుతో వేమూరి రవికి ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎపీఎన్ఆర్ టీ) ప్రెసిడెంట్ పదవి అప్పగించింది. ఈ విషయం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో అందరికీ తెలిసిందే. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకరు ఉన్నతాధికారులతో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్ లోనే బహిరంగంగానే వేమూరి రవిని పరిచయం చేస్తూ ఇదే విషయాన్ని చెప్పారు. అప్పటికి నారా లోకేష్ ఇంకా మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించలేదు. ఆ సీఎస్ తీరు చూసి అదికారులు కూడా అవాక్కు అయ్యారు. లోకేష్ సిఫారసుతో పదవి దక్కించుకోవటం ఒకెత్తు అయితే...ఇప్పుడు వేమూరి రవి సిఫారసుతో పలు ఐటి కంపెనీలకు కోట్ల రూపాయల రాయితీలు కల్పించటం మరో ఎత్తు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే నారా లోకేష్ ఐటి శాఖను తమ ఫ్యామిలీ ఎఫైర్ గా మార్చేసినట్లు ఉందని ఆ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఏ కంపెనీకి అయినా రాయితీలు, ప్రోత్సాహకాలు రావాలంటే అది ఐటి విధానానికి అనుగుణంగా ఉండాలి. అసలు ఏపీఎన్ ఆర్ టీ సిఫారసు ఏంటి?. అలా సిఫారసు చేసిన కంపెనీలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు రాయితీల కింద అప్పగించటం ఏమిటి? ఇదంతా అడ్డగోలుగా సాగుతోందని ఐటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఐటి శాఖ నుంచి ఎపీఎన్ ఆర్ టి సిఫారసుతో లక్షలాది రూపాయలు పొందిన సంస్థల్లో కొన్ని ఓ 50 వేల రూపాయలు ఖర్చు పెట్టి..ఓ వైబ్ సైట్ కూడా పెట్టుకోలేదంటే అవి ఎంత సీరియస్ కంపెనీలో ఊహించుకోవచ్చు. నిజంగా అవి ఐటి కంపెనీలే అయితే సొంత ఉద్యోగులే ఒక్క రోజులో వెబ్ సైట్ తయారు చేస్తారు. కానీ అదేమీ లేదు. కానీ పెట్టుబడి రాయితీ పేరుతో మాత్రం ప్రజల డబ్బును మాత్రం పంచేశారు. ఆ లెక్క ఏంటో మీరూ ఓ సారి చూడండి.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన గణ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ డెవలప్ మెంట్ సొసైటీ పెట్టుబడి రాయితీ కింద ఏపీఎన్ ఆర్ టీ సిఫారసుతో 19,50,705 రూపాయలు చెల్లించారు. అదే మంగళగిరిలో ఎస్ డిఎన్ టెలికం ప్రైవేట్ లిమిటెడ్ కు పెట్టుబడి రాయితీ కింద 33,99,573 రూపాయలు చెల్లించారు. ఇదీ ఎన్ఆర్ టీ సిఫారసుతోనే. జెడ్ యాక్సిస్ ఐటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 10,40,575 రూపాయలు, కెల్లీ టెక్నాలజీస్ కు 11,57,480 రూపాయలు చెల్లించారు. ఇవన్నీ మంగళగిరిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్ల రికార్డులు చెబుతున్నాయి. పెట్టుబడి రాయితీ చెల్లించినవి మొత్తం ఏడు కంపెనీలు ఉంటే..అందులో నాలుగు ఎపీఎన్ ఆర్ టి సిఫారసు చేసినవి కావటం విశేషం. అంతే కాదు..ఎపీఎన్ఆర్ టి సిఫారసు చేసిన వారి కోసం రాజధాని పేరుతో తీసుకున్న భూముల్లో ఓ టవర్ కట్టి మరీ..ఐటి స్పేస్ కేటాయించబోతున్నారు. ఐటి అభివృద్ధి పేరుతో నారా లోకేష్ శాఖలో జరిగే గోల్ మాల్ లు ఎన్నో ఉన్నాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.