Telugu Gateway
Telangana

ఆత్మరక్షణలో టీఆర్ఎస్!

ఆత్మరక్షణలో టీఆర్ఎస్!
X

ముందస్తు ఎన్నికలతో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆత్మరక్షణలో పడిందా?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు కూడా. పైకి ఎన్ని చెప్పినా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఐటి దాడుల వ్యవహారం టీఆర్ఎస్ కు నష్టం చేస్తుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఐటి దాడుల్లో మీడియాలో ప్రచారం జరిగిన స్థాయిలో కాదు కదా.. పెద్దగా ఏమీ దొరికిన దాఖలాలు ఏమీ కన్పించటం లేదు. ఐటి శాఖ కూడా ఇంత వరకూ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఇదే అదనుగా రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి కెసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపైనే ఛాలెంజ్ విసిరారు. ఆస్తులపై విచారణకు ఏకంగా ప్రధాని మోడీకే లేఖ రాద్దామని సవాల్ చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటి దాడుల్లో ఏమైనా దొరికి ఉన్నా..కేంద్ర విచారణ సంస్థలు నిగ్గుతేల్చగల అక్రమాలు ఆయన ఏమైనా చేసి అంటే అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తాడని ఎవరూ అనుకోరు.

ఈ మధ్య కాలంలో ఎక్కడా జరగని రీతిలో ఏకంగా రెండు రోజుల పాటు ఐటి దాడులు జరిగినా రేవంత్ రెడ్డి నివాసంలో పెద్దగా ఏమీ దొరకలేదనే సమాచారమే వస్తోంది. ఈ అంశంలో రాజకీయంగా రేవంత్ రెడ్డి పై చేయి సాధించినట్లు అయింది. ఓటుకు నోటు కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డి కొంత కాలం జైలుకెళ్లి వచ్చినందున అదే కేసుల్లో ఆయన్ను మరోసారి అరెస్టు చేసే అవకాశాలు ఉండవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని సొంత నేతలతో పాటు..పార్టీ వెలుపలి శక్తులు కూడా రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత దక్కకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ అవేమీ ఫలించలేదు. పైగా ఈ ఐటి దాడులతో ఫోకస్ అంతా రేవంత్ రెడ్డి వైపే మళ్ళింది. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై హౌసింగ్ స్కామ్ కు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద నివేదికలు కూడా ఉన్నాయి. కానీ అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ కేసును ఎప్పుడూ టీఆర్ఎస్ సర్కారు బయటకు తీయలేదు.

మియాపూర్ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సమయంలో భూ స్కామ్ లకు సంబంధించి కాంగ్రెస్ నేతల జాతకాలు అన్నీ తమ దగ్గర ఉన్నాయని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అవీ ఏమీ బయటకు రాలేదు. ఎవరికిష్టం ఉన్నా లేకున్నా...మాటల విషయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ను ధీటుగా ఎదుర్కొగల వ్యక్తి రేవంత్ రెడ్డేనని..అందుకే ఆయన్ను టార్గెట్ చేశారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఆస్తులపై విచారణకు సంబంధించి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన తర్వాత దీనికి స్పందనగా టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ‘ఫ్రస్టేషన్’ను తెలియజేస్తున్నాయని ఓ నేత వ్యాఖ్యానించారు. బాల్కసుమన్ తీవ్ర పదజాలంతో రేవంత్ రెడ్డిపై విరుకుపడ్డారు. అంతిమంగా తాజా పరిణామాలు మాత్రం టీఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేశాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it