Top
Telugu Gateway

వివాహేతర సంబంధం నేరం కాదు

వివాహేతర సంబంధం నేరం కాదు
X

భారత వివాహ వ్యవస్థకు పెద్ద కుదుపు. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతతర సంబంధం నేరం కాదని పేర్కొంది. అయితే అదే సమయంలో వివాహేతర సంబంధం కారణంగా విడాకులు తీసుకోవచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు ఐపీసీలోని సెక్షన్ 497 ఉండాల్సిందని వాదించింది. అయితే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. ఐపీసీలోని సెక్షన్‌ 497 రాజ్యాంగవిరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మహిళలను తోటి మనుషులుగా కాకుండా వస్తువులుగా పరిగణిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదని, వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. పరస్పర సమ్మతితో చేసే శృంగారం ఇకపై నేరం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

సెక్షన్ 497 ఒక పురాతన చట్టమని, అది ఏకపక్షంగా ఉందని అభిప్రాయపడింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సెక్షన్ 497తోపాటు సెక్షన్ 198 కూడా రాజ్యాంగ సమ్మతం కాదని వెల్లడించింది. సెక్షన్ 497 మహిళల సమాన అవకాశాలను కాలరాస్తోందని, సమానత్వ హక్కులను తూట్లు పొడిచేలా ఇది ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. మహిళలను సమానులుగా చూడని ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమేనని, వివాహేతర సంబంధాల్లో పురుషులను మాత్రమే బాధ్యులను చేసే సెక్షన్‌ 497 సరికాదని, మహిళలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది. కొంత మంది పెళ్లి అయితే భార్య తమకు పూర్తి హక్కులు వచ్చేసినట్లు భావిస్తున్నారని..ఇది సరికాదని పేర్కొంది. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి.. పెళ్లయిన పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్‌ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్‌ షైనీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

వివాహేతర లైంగిక సంబంధాలు ఉంటే.. ఆ పరిణామాలతో సంబంధం లేకుండానే.. పెళ్లి రద్దుకు దారితీసే విధంగా ఈ చట్టం ఉందని ఆయన అన్నారు. సెక్షన్‌ 497 ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకు ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్‌ కూడా ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలని, కాబట్టి ఈ సెక్షన్‌ను చెల్లబోదని పిటిషనర్‌ వాదించారు.

Next Story
Share it