Telugu Gateway
Telangana

కెసీఆర్ నిర్ణయానికి ఎదురుదెబ్బ

కెసీఆర్ నిర్ణయానికి ఎదురుదెబ్బ
X

ముందస్తు ఎన్నికల వేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయానికి హైకోర్టులో ఎదురుదెబ్బ. ప్రజలకు కనీసం నిరసన తెలుపుకునే ఛాన్స్ కూడా లేకుండా కెసీఆర్ సర్కారు ఎప్పుడో ‘ధర్నా చౌక్’ను ఎత్తేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్ని వినతులు వచ్చినా కెసీఆర్ ససేమిరా అన్నారు. నగరంలో ఇది ఉండటానికి వీల్లేదని..దీని వల్ల ప్రజలకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘నిరసన గళాలను అణచివేస్తామంటే కుదరదు. ధర్నాల వల్ల ఇబ్బంది కలుగుతుందనుకుంటే అర్థవంతమైన ఆంక్షలు విధించాలి. అంతే తప్ప ఎక్కడో ఊరు అవతల 50 కిలోమీటర్ల దూరంలో ధర్నాలు చేసుకోమంటే ఎలా? అడవిలో సెల్‌టవర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? సింహాలు, పులులు సెల్‌ఫోన్లు వాడవు కదా. మనుషులు ఉన్న చోటే సెల్‌టవర్లు పెట్టాలి. అలాగే ధర్నాచౌక్‌ కూడా. జనాల మధ్యలో ధర్నాలు చేయకుండా రిషీకేశ్‌కు వెళ్లి చేయమంటారా? అధికారంలోకి వచ్చేందుకు ఈ ధర్నా చౌక్‌ చాలా మందికి ఉపయోగపడిందన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా?’అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.

ధర్నాచౌక్‌ కోసం గుర్తించిన ప్రాంతాలు, అక్కడ కల్పించిన సౌకర్యాల వంటి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అదే రోజు ధర్నాచౌక్‌ వ్యవహారాన్ని తేల్చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయగా ఇదే అంశంపై విశ్రాంత ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఎన్నికల సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు తమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Next Story
Share it