Telugu Gateway
Movie reviews

‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ

‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ
X

ఒక్క ‘లైన్’ తీసుకుని దాని చుట్టూ కథలు అల్లుకోవటంలో దర్శకుడు మారుతి సక్సెస్ సాధిస్తున్నారు. ఈ మధ్యే అతి శుభ్రం అనే ఒకే ఒక్క లైన్ తీసుకుని ‘మహానుభావుడు’ సినిమాతో సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు కూడా అచ్చం అదే లైన్ లో ‘ఇగో’ అనే అంశాన్ని తీసుకుని ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాను తెరకెక్కించారు. ఇగోతో వచ్చే అనర్ధాలు...తండ్రీ కొడుకులు, తల్లీ, కూతుర్ల మధ్య ఇగో సృష్టించే గ్యాప్ ..దాని వల్ల కుటుంబంలో జరిగే గొడవలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో మధ్య మధ్యలో కామెడీని మిక్స్ చేస్తూ సరదాగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో మారుతి మరో సారి సక్సెస్ సాధించారనే చెప్పొచ్చు. శైలజారెడ్డి అల్లుడు సినిమాలో నాగ చైతన్య తండ్రిగా నటించిన మురళీ శర్మ అత్యంత ఇగో ఉన్న వ్యక్తిగా సూపర్ గా నటించారు. ఆయనకు ఉన్న ఇగో ఎంత అంటే తన కూతురికి నచ్చిన కుర్రాడి కాళ్లు తాను కడగటం ఏమిటనే ఇగోతో ఏకంగా పెళ్లినే చెడగొట్టేస్తాడు. ఇక హీరోయిన్ అను ఇమాన్యుయల్ తల్లిగా...మూర్తీభవించిన అహంకారంతో ఉన్న పాత్రలో రమ్యకృష్ణ కూడా తనదైన నటన చూపించారు. కావాల్సినంత ఇగో ఉన్న అమ్మాయిగా అను ఇమ్మాన్యుయల్ ఈ సినిమాలో ఓ కొత్త పాత్ర చేశారనే చెప్పొచ్చు. కావాల్సినంత ఓపిక, ఇగో జబ్బు బాధితులను దారిలో పెట్టే పాత్రకు హీరో నాగచైతన్య కూడా న్యాయం చేశారు. ఫస్టాఫ్ లో వచ్చే నాగచైతన్య, అను ఇమాన్యుయల్ లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మూర్తీభవించే అహంకారంతో కూడిన కుటుంబాల మధ్య పెళ్లిళ్ళ వ్యవహారమే ఈ సినిమా. ఫస్టాఫ్ లో ఎక్కువగా వెన్నెల కిషోర్ కామోడీ నవ్వు తెప్పిస్తుంది. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ తోడుగా థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎంటర్ అయినా ఆయన కామెడీ సీన్లు కొన్ని ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. సినిమా టేకింగ్ అంతా రిచ్ గా ఉండటంతో పాటు..పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి. దర్శకుడిగా, రచయితగా మారుతి ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాను కమర్షియల్ హిట్ వైపు నడిపించారనే చెప్పొచ్చు. ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్యకు హిట్ దక్కటంతో పాటు కొత్త లుక్ లో ఆకట్టుకున్నారు. మొత్తం మీద ‘శైలజారెడ్డి అల్లుడు’ పండగలో సందడి చేయటం ఖాయం.

రేటింగ్. 2.75/5

Next Story
Share it